విన్నారా.. విడాకులకూ ఇన్సూరెన్స్.. కవరేజీ రూ.30 లక్షలు

విన్నారా.. విడాకులకూ ఇన్సూరెన్స్.. కవరేజీ రూ.30 లక్షలు
X

శుభమా అంటూ పెళ్లి చేసుకుంటుంటే.. ఈ అపశకునపు మాటలేమిటి.. మూడు ముళ్లైనా పడలేదు.. ఈ విడాకుల గోలేంటి.. బుద్ది ఉందా కొంచెమైనా అని కోప్పడకండి. ఏం చేస్తాం పరిస్థితులు అలా ఉన్నాయి మరి. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం ఎందుకని.. ముందుగానే మేల్కోమంటున్నాయి ఇన్సూరెన్స్ సంస్థలు. ఒకప్పుడు పాశ్చాత్య దేశాలకు మాత్రమే పరిమితమైన ఈ విడాకుల సంస్కృతి ఇప్పుడు భారతదేశంలో పెరిగింది. మరి అన్నింటినీ అనుకరిస్తున్నప్పుడు ఇది కూడా ఒంటబట్టించుకోక తప్పని పరిస్థితి. తినగ తినగ వేము తియ్యన అన్నచందగా.. కొన్ని రోజులకు ఇదీ అలవాటైపోతుంది.. అదేమంత కొత్త విషయంగా అనిపించకపోవచ్చు.

వివాహానికి ఎంతో విలువిచ్చే భారతీయులు చిన్న చిన్న కారణాలకే విడాకులదాకా వెళుతున్నారు. విడాకులకు అప్లై చేసుకున్న ఓ వ్యక్తి భార్యకు భరణంగా రూ.30 లక్షలు చెల్లించాల్సి వచ్చింది అనుకుంటే.. ఇంతకు ముందు అతడు దాచిపెట్టుకున్న సొమ్ము రూ.10 లక్షల దాకా అయితే ఉంది. కానీ ఇంకా రూ.20 లక్షలు కావాలి. ఎలారా భగవంతుడా అని తల పట్టుకునే వారికోసమే ఈ బీమా పథకాలు అందుబాటులోకి వచ్చాయి. మన దేశంలో ఇలాంటివి వినడానికే ఆశ్చర్యంగా అనిపించినా విదేశాల్లో ఈ పథకాలు ఎప్పుడో అమలులోకి వచ్చాయి.

ఈజిప్ట్ వంటి దేశాలు విడాకుల ఇన్సూరెన్స్‌ను తప్పనిసరి చేస్తూ చట్టాలు తీసుకువస్తున్నాయి. దీంతో భర్త విడాకుల భరణాన్ని భార్యకు చెల్లించడం సులువవుతుంది. భారతదేశంలో కూడా గతంతో పోలిస్తే విడాకులు తీసుకునే జంటల సంఖ్య ఎక్కువవుతోంది. 2011 లెక్కల ప్రకారం భారతదేశంలో 13,62,316 మంది విడాకులు తీసుకున్నారు. భరణం చెల్లిపుల మొత్తం కూడా 35 శాతం దాకా పెరిగింది. పెళ్లి సమయంలోనే విడాకుల ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దీంతో ఒకవేళ విడాకులు తీసుకుంటే ఆ ఖర్చులన్నీ పాలసీనే భరిస్తుంది.

ప్రీమియం మొత్తం బీమా మొత్తంపై ఆధారపడి ఉంటుంది. కనీసం 2-3 ఏళ్లు ప్రీమియం చెల్లిస్తే పాలసీ వర్తిస్తుంది. రూ.25 లక్షలు లేదా రూ.30 లక్షలకు పాలసీ తీసుకోవచ్చు. పాలసీ ప్రీమియం ఏడాదికి రూ.15,000 లోపు ఉండొచ్చు. ఇంకా భారత్‌లో భార్య ఎంతైనా భరణం కోరవచ్చు. ఒకేసారి సెటిల్‌మెంట్ కోరుకుంటే భర్త నికర ఆదాయంలో మూడో వంతు ఆమెకు వెళ్లిపోతుంది. నిజానికి భార్య భర్తలు ఇరువురు కలకాలం కలిసి జీవించాలని కోరుకుంటారు ఎవరైనా.. కానీ కలహాలతో విడిపోవాలని కాదు. కానీ పరిస్థితులు అనుకూలించక కొందరు విడిపోతుంటారు. అలాంటి వారికి భరణం భారం కాకూడదనే ఉద్దేశంతో వచ్చినవే ఈ ఇన్సూరెన్స్ పాలసీలు.

Also Watch

Tags

Next Story