తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు ఇవే..

ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షత... తెలంగాణ కేబినెట్‌ సమావేశం జరిగింది. మంత్రివర్గ విస్తరణ అనంతరం తొలిసారిగా కేబినెట్‌ సమావేశమైంది. పాత, కొత్తమంత్రులు మొత్తం 18 మంది పాల్గొన్న ఈ సమావేశం దాదాపు రెండున్నర గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ పద్దులపై సుదీర్ఘంగా చర్చించారు. వీటితో పాటు పలు కీలక నిర్ణయాలపై చర్చించి ఆమోదం తెలిపారు. ప్రధానంగా బడ్జెట్‌పైనా సుధీర్ఘంగా చర్చ జరిగింది. అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు ఆమోదం తెలిపిన మంత్రివర్గం కొత్త అసెంబ్లీ, సెక్రటేరియట్‌ నిర్మాణాలు, శాసన సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైనా చర్చించింది. దీంతోపాటు వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌కు మారుస్తూ నిర్ణయం తీసుకుంది. జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది.

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... ఈ ఏడాది ప్రథమార్ధంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇవాళ ఉదయం 11.30కి తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌.. శాసనమండలిలో మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ ప్రవేశపెడతారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన అనంతరం.. శాసనసభ వాయిదా పడనుంది. ఆ తర్వాత అసెంబ్లీ సమావేశాలకు సంబందించి స్పీకర్‌ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చిస్తారు. రాష్ట్రంలో విషజ్వరాలు, యూరియా కొరిత, విద్యుత్‌ కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తదితర అంశాలపై ఈ సారి అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. అధికారపక్షాన్ని నిలదీసేందుకు ‌కాంగ్రెస్‌ పార్టీ రెడీ అవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story