పింఛన్‌దారులకు గుడ్ న్యూస్

పింఛన్‌దారులకు గుడ్ న్యూస్

తెలంగాణ పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ 2019-20ని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. లక్షా 46 వేల కోట్లతో 2019-20 పూర్తి స్థాయి బడ్జెట్‌ను రూపొందించారు. తీవ్రమైన ఆర్థిక మాంద్యం ఉన్నప్పటికీ.. సంక్షేమానికే పెద్దపీట వేశామన్నారు. రైతులు, పేదల జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉందన్నారు. అయితే... ఈ బడ్జెట్‌పై విపక్షాలు పెదవి విరిచాయి. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టేశారంటూ కాంగ్రెస్‌, బీజేపీ మండిపడ్డాయి.

ఓటాన్‌ అకౌంట్‌తో పోల్చితే తెలంగాణ బడ్జెట్ తగ్గింది. ఓటాన్ అకౌంట్ లక్షా 82 వేల 17 కోట్లు ఉండగా.. ప్రస్తుత పద్దు లక్షా 46 వేల 492 కోట్లకే పరిమితమైంది. బడ్జెట్‌పై ఆర్థిక మాంద్యం ప్రభావం ఉందన్నారు సీఎం కేసీఆర్‌. రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి ఎప్పటిలాగే కేటాయింపులు జరిపారు. కేంద్రం నుంచి అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదన్న కేసీఆర్.. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగుతుందని ప్రకటించారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రవేశపెట్టిన రైతుబంధు, బీమా పథకాలకు డోకా లేదన్నారు సీఎం. రైతుబంధు కోసం 12 వేల కోట్లు, బీమా ప్రీమియానికి 11వందల 37 కోట్లు కేటాయించారు. రుణాల మాఫీ కోసం 6 వేల కోట్లు ప్రతిపాదించారు.

ఇక... వృద్ధాప్య పెన్షన్‌ వయో పరిమితి 65 ఏళ్ల నుంచి 57కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు సీఎం. త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారికీ పెన్షన్‌ లభిస్తుందన్నారు. ఆసరా కోసం బడ్జెట్‌లో 9 వేల 402 కోట్లు కేటాయించారు. కేంద్రం తెచ్చిన ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీ బాగుందన్నారు కేసీఆర్‌. మరోవైపు మండలిలో ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను చదివి వినిపించారు. ఆర్ధిక మాంద్యం ప్రభావం ఉన్న... సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్‌ . మరోవైపు తెలంగాణ బడ్జెట్ పై విపక్షాలు మండిపడ్డాయి. బడ్జెట్‌ వాస్తవానికి దూరంగా ఉందని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్‌ సర్కారుకు ఆర్థిక క్రమశిక్షణ లేదంటూ ఆ పార్టీ శాసనసభా పక్షనేత భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన రాష్ట్రం.. అప్పుల్లో ఎలా కూరుకుపోయిందని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story