పాలు, తేనె కలిపి తీసుకుంటే సంతానోత్పత్తి..

పాలు, తేనె కలిపి తీసుకుంటే సంతానోత్పత్తి..

పాపాయిల నుంచి పండు ముదుసలి వరకు పాలను ఇష్టపడతారు. పాలల్లో ఉన్న క్యాల్షియం ఎముకలు ధృఢంగా మారడానికి సహకరిస్తుంది. అందుకే ప్రతి రోజూ ఓ గ్లాస్ పాలు తాగమని చెబుతుంటారు వైద్యులు. ఇక స్కూలుకు వెళ్లే చిన్నారులకైతే అమ్మ పాలగ్లాస్ తీసుకుని వెంటపడుతుంది. టిఫిన్ తినకపోయినా కనీసం పాలైనా తాగమంటూ. మరి మారాం చేయకుండా పాలు తాగాలంటే అందులో ఏదో ఒక పౌడర్ జోడించాల్సి వస్తుంది. గ్లాస్ గోరు వెచ్చని పాలల్లో రెండు స్పూన్ల తేనె వేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది.

తేనెలో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో అనారోగ్య సమస్యలు దరి చేరవు. పాలు, తేనె కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. త్వరగా జలుబు, దగ్గు వంటివి దరి చేరకుండా ఉంటాయి. శరీర జీవక్రియ పెరిగి అరుగుదల శక్తి బావుంటుంది. దంత సమస్యలు, కీళ్ల నొప్పులు వంటివి వేధించవు. ఈజిప్ట్ రాణి క్లియోపాత్ర ఆరోగ్యంగా మరియు యవ్వనంగా కనిపించడం కోసం రోజూ పాలలో తేనె వేసుకుని త్రాగేదని చరిత్రకారులు చెబుతుంటారు.

బరువుని తగ్గించడంలో కూడా ప్రధాన పాత్ర వహిస్తుంది. తేనెలో ఎనర్జీ అందించే లక్షణాలు ఉంటే, పాలలో ఫ్యాట్‌ను కరిగించే ప్రొటీన్స్ ఉండడం వల్ల అదనపు కొవ్వు పెరగకుండా శరీరాన్ని రక్షిస్తుంది. సహజంగా సంతానోత్పత్తి పొందేందుకు సహాయకారిగా పని చేస్తుంది ఈ రెండి మిశ్రమం. ఇంకా ఓవరీస్‌ను క్రమబద్ధం చేస్తుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థకు అవసరం అయ్యే పోషణను అందిస్తుంది. పాలలోని ప్రొటీన్స్, తేనెలోని కార్బొహైడ్రేట్స్ శరీరానికి కావలసిన శక్తిని అందిస్తుంది.

నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు తాగితే మంచి నిద్ర పడుతుంది. చాలా మందిని వేధించే మరో ముఖ్య సమస్య మలబద్దకం. పరగడుపున పాలు, తేనె కలిపి తీసుకుంటే పొట్ట శుభ్రపడుతుంది. గుండెలో మంటగా అనిపించినప్పుడు భోజనం చేసిన తరువాత చల్లటి పాలలో ఒక చెంచా తేనె వేసుకుని తాగితే ఉపశమనంగా ఉంటుంది.

Tags

Read MoreRead Less
Next Story