ఇస్రో చివరి ప్రయత్నాలు.. రంగంలోకి నాసా..

ఇస్రో చివరి ప్రయత్నాలు.. రంగంలోకి నాసా..

చంద్రుడి ఉపరితలంపై ఉండి ఉలుకుపలుకు లేని విక్రమ్‌ జాడ కోసం ఇస్రో చివరి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాను రంగంలో దింపింది. మన ల్యాండర్‌ తో అనుసంధానం అయ్యేందుకు నాసా సంకేతాలు పంపుతోంది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్ ల్యాబోరేటరీ తన డీప్‌ స్పేస్‌ నెట్‌ వర్క్‌‌ ద్వారా విక్రమ్‌ కు రేడియో తరంగాలు పంపుతుంది.

కాలిఫోర్నియా, స్పెయిన్‌ లోని మాడ్రిడ్‌, ఆస్ట్రేలియాలోని కాన్‌ బెర్రాలోని ఉన్న మూడు నాసా డీప్‌ స్పేస్‌ స్టేషన్ల నుంచి సంకేతాలు వెళుతున్నాయి. ఇందులో ఏదో ఒకదానికి ల్యాండర్‌ విక్రమ్‌ స్పందించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా సాయంతో ల్యాండర్‌ విక్రమ్‌ జాడ తెలుస్తుందన్న చిన్న ఆశ భారతీయ శాస్త్రవేత్తల్లో ఉంది.

అమెరికాకు చెందిన మూన్‌ ఆర్బిటర్‌ లూనార్‌ రికానసెన్స్‌ ఉపగ్రహం మన విక్రమ్‌ ల్యాండర్‌ ఫోటోలు తీసి పంపే అవకాశం ఉంది. ఈ నెల 17న విక్రమ్‌ ఉన్న ప్రదేశానికి సమీపానికి అమెరికాకు చెందిన ఆర్బిటార్‌ వస్తుంది. ఆ సమయంలో తీసే ఫోటోలు కీలకం కానున్నాయి. వాటి ద్వారా విక్రమ్‌ ల్యాండర్‌ జాడ తెలుసుకునే అవకాశం ఉంది. ఎందుకు సిగ్నల్‌ అందించడం లేదన్న దానిపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story