తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన గణేశ్‌ నిమజ్జన కార్యక్రమం

తెలుగు రాష్ట్రాల్లో గణేశ్‌ నిమజ్జన కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు భక్తులు.. భక్తి శ్రద్ధలతో గణనాథులకు పూజలు నిర్వహించి మేళతాళాలు, డప్పు దరువులు, కోలాటాలు, డీజే పాటలతో నిమజ్జనోత్సవాన్ని కోలాహలంగా చేశారు. రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో గణేష్‌ నిమజ్జనాలు కన్నుల పండువగా సాగాయి.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. గోదావరి తీరంలోని గౌతమీ ఘాట్‌ సమీపంలో వినాయక ప్రతిమలను నిమజ్జనం చేశారు. దాదాపు 200 విగ్రహాలకుపైగా గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.. మరోవైపు భారీ ఊరేగింపులతో నగరంలో కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కర్నూల్ నగరంలో 11 రోజుల పాటు భక్తులతో పూజలందుకున్న 65 అడుగుల మహా మట్టి గణపతిని తుంగభద్ర నది ఒడ్డున సంప్రదాయ బద్ధంగా నిమజ్జనం చేశారు. నిమజ్జన కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రారంభించారు. నిమజ్జనోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సింగరేణి ప్రకాశం స్టేడియంలో గణేశ్‌ శోభాయాత్ర కన్నుల పండువగా జరిగింది. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏటా విజయ విఘ్నేశ్వరాలయంలో నవరాత్రి పూజలు అందుకున్న గణేశ్‌ విగ్రహాలకు పూజలు నిర్వహించారు. అనంతరం భద్రాచలంలోని పవిత్ర గోదావరి నదిలో నిమజ్జనం చేశారు.

నిర్మల్‌ జిల్లా కేంద్రం గణపతిబప్పా మోరియా నినాదాలతో హోరెత్తిపోయింది.. 11రోజులపాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరారు. జయజయ ధ్వానాల మధ్య విఘ్నేశ్వరునికి భక్తజనం శోభాయాత్ర నిర్వహించారు. మళ్లీరా గణపయ్య అంటూ వీడ్కోలు పలికారు. అందంగా అలంకరించిన వాహనాలపై స్వామివారి ప్రతిమలు ఉంచి నృత్యాలు చేస్తూ సందడి చేస్తూ ముందుకు సాగారు.

నిజామాబాద్ జిల్లాలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆద్వర్యం లో నిర్వహించిన శోభాయాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నగరంలోని కిషాన్ గంజ్ నుంచి ప్రధాన వీధుల మీదుగా ఊరేగింపు చేపట్టారు. ఆర్యవైశ్య మహిళలు ఆటపాటలు, కోలాటాలు.. ఆంధ్ర మహారాష్ట్రకు చెందిన కళా బృందాలు చేపట్టిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. వివిధ రకాల సంస్కృతులు సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కళాకారుల విన్యాసాలు ప్రదర్శనలు అలరించాయి.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story