గ్యాంగ్ లీడర్ రివ్యూ.. ప్రతి ఫ్యామిలీ గ్యాంగ్‌లో ఇలాంటి లీడర్‌ని..

గ్యాంగ్ లీడర్ రివ్యూ.. ప్రతి ఫ్యామిలీ గ్యాంగ్‌లో ఇలాంటి లీడర్‌ని..

టైటిల్‌ : నాని గ్యాంగ్‌ లీడర్

జానర్‌ : కామెడీ రివేంజ్‌ డ్రామా

నటీనటులు : నాని, కార్తికేయ, ప్రియాంక అరుల్‌ మోహన్‌, లక్ష్మి, శరణ్య, ప్రియదర్శి

మ్యూజిక్ : అనిరుధ్‌

నిర్మాత : మోహన్ చెరుకూరి, రవిశంకర్‌ యలమంచిలి, నవీన్‌ ఎర్నేని

దర్శకత్వం : విక్రమ్‌ కె కుమార్‌

నాని సినిమాకి అలవాటు పడిపోయిన ఫ్యామిలీ ఆడియెన్స్ సంఖ్య చాలా ఎక్కువుగా ఉంటుంది. నాని నటించిన చాలా సినిమాలు.. కాసేపు నవ్వించడంలో ఢోకాలేదనే ఇంప్రెషన్‌ను క్రియేట్ చేశాయి. జెర్సీ తో నటుడిగా బలమైన ముద్రను వేసిన నాని విక్రమ్ కుమార్ తో కలసి గ్యాంగ్ లీడర్ గా మరాడు. మరి ఆ గ్యాంగ్ తో కలసి అందించిన ఎంటర్‌టైన్మెంట్ ఎలా ఉందో తెలుసుకుందాం..

కథ:

పెన్సిల్ పార్ధ సారధి( నాని) ఒక థ్రిలర్స్ స్టోరీస్ రాసే రైటర్. అతని దగ్గరకు ఒక గ్యాంగ్ వస్తుంది. అందులో బామ్మ(లక్ష్మీ)తో పాటు మరో నలుగురు ఉంటారు. ఈ ఐదుగురు కి ఒక పగ ఉంటుంది. రూ. 300 కోట్ల బ్యాంక్ రాబరీలో చనిపోయిన వారి బంధువులు వీరంతా. ఆ రాబరీ లో ఉన్న ఒక అతను మిగిలిన వారిని చంపి ఆ డబ్బుతో పారిపోతాడు. ఈ ఐదుగురు ఆడవాళ్ళు తమ పగకు సహాయం చేయమని పార్ధ సారథిని కోరతారు. వీరు పగ నుండి కథను డెవలెప్ చేయొచ్చని వారి పగకు సహాయం చేసేందుకు ఒప్పుకుంటాడు. దీంతో పార్ధ సారథి జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంది..? ఆ హాంతకుడ్ని ఎలా పట్టుకున్నారు..? వారి పగకు పార్ద సారథి అందించిన సాయం ఎంటనేది మిగిలిన కథ..?

కథనం:

గ్యాంగ్ లీడర్ టైటిల్ కి నానిస్ అని యాడ్ చేయడం తోనే ఈ సినిమా మూడ్ ఏంటో అర్ధం అయ్యింది. ఒక సీరియస్ క్రైం బ్యాక్ డ్రాప్ అందమైన ఫ్యామిలీ ఎమోషన్స్ ని అద్భుతంగా పలికించాడు దర్శకుడు విక్రమ్ కుమార్. అతని సెన్సిబిలిటీస్ మీద ఉండే నమ్మకాన్ని మరింత పెంచింది గ్యాంగ్ లీడర్. మనిషికి మనిషి ఎంత అవసరమో, బంధాల మధ్య బతికే జీవితం ఎంత గొప్పగా ఉంటుందో గ్యాంగ్ లీడర్‌తో మరోసారి చూపించాడు. నాని ఇంట్రడక్షన్ నుండి ఆ పాత్ర పై ప్రేమ పెంచాడు దర్శకుడు. పెన్సిల్ పార్ధ సారథిగా నాని క్యారెక్టర్ తో విక్రమ్ చేయించిన కామెడీ బాగా పండింది. ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కాంబినేషనల్ సీన్స్ చాలా బాగా వర్క్ అవుట్ అయ్యాయి. ముఖ్యంగా నాని తో హీరోయిన్ ‘షర్ట్ బటన్ ఓపెన్ చేయి’ అనే డైలాగ్ కి హాల్ కేకలతో దద్దరిల్లిపోతుంది. ఒక పెద్ద బ్యాంక్ రాబరీ జరుగుతుంది. రూ. 300 కోట్లు చాలా ప్లాన్డ్‌గా కొట్టేసిని ఆ దొంగ తనతో పాటు వచ్చిన వారందరినీ చంపేసి, ఆ డబ్బుతో పారిపోతాడు. అలాంటి క్రిమినల్ చేతిలో చనిపోయిన వారి కుటుంబాల నుండి వచ్చిన ఐదుగురు మహిళలు ఒక గ్యాంగ్ గా మారి దానికి ఒక లీడర్ ని ఎన్నుకుంటారు. అతడేమీ ఆరడుగుల ఆజాను బాహుడు కాదు, సిక్స్ ప్యాక్ లతో మార్షల్ ఆర్ట్స్ తో ఉన్న ఫైటర్ కూడా కాదు. ఇంగ్గీష్ కథలను చూసి తెలుగులో బుక్స్ రాసే కాపీ రైటర్. సామాన్యుడైన హీరో, శక్తి మంతుడైన విలన్, హీరో పోరాటం తనకోసం కాదు, తనకేమీ కానీ వారికోసం ఈ బేసిక్ పాయింట్ చుట్టూ విక్రమ్ కుమార్ అల్లుకున్న కథ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

ఓ బేబీ మూవీతో తన సత్తా చూపించిన లక్ష్మీ మరోసారి విజృంభించింది. ఇక హీరోయిన్ ప్రియాంక్ అరుల్ లుక్స్ బాగున్నాయి. ఆమెకు, నానికి మధ్య సాగే అండర్ కరెంట్ లవ్ స్టోరీని ఎక్కడా శృతిమించకుండా డీల్ చేశాడు దర్శకుడు. హీరోయిన్ తన కాబోయె భర్తను చంపిన వాడిమీద పగతో హీరో దగ్గరకు వస్తుంది. అతన్ని మర్చిపోయి ప్రేమలో పడే అవకాశం లేదు. మరొకరితో ప్రేమలో పడితే పగలోని డెప్త్ పోతుంది. క్యారెక్టర్ కన్‌ఫ్యూజ్ అవుతుంది. అందుకే వారి మద్య ఉన్న ఆకర్షణను రైటర్‌ వే లో అందంగా డీల్ చేశాడు దర్శకుడు. ఇక తన సాయం కోసం వచ్చిన ఐదుగురు మహిళల్లో తన కుంటుంబాన్ని చూసుకున్న పార్ధ సారథి వారి సమస్యను తన కథ కోసం కాకుండా.. తన ఫ్యామిలీ అనుకొని ముందుకు సాగడం బాగుంది. దానికి వారి మధ్య దర్శకుడు రాసుకున్న సన్నివేశాలు బాగున్నాయి. ముఖ్యంగా ‘పాప బర్త్ డే సీన్ హైలెట్ ’గా నిలుస్తుంది.

విలన్ గా కార్తికేయ నటన బాగుంది. అతని క్యారెక్టరైజేషన్ ని కూడా బాగా డెవలెప్ చేశాడు. రేసర్ అవ్వాలనుకునే అతని కథను చాలా ఎఫెక్టివ్ గా చెప్పాడు. అతని క్యారెక్టరైజేషన్ మీద పూర్తి సినిమాను నడిపేంతగా ఇంపాక్ట్ ఇచ్చాడు. సెలబ్రెటీ హోదాలో వచ్చిన కార్తికేయకు కొన్ని విజువల్స్ చూపించే విధంగా ప్లాన్ చేస్తాడు హీరో.. అక్కడ కార్తికేయ నటన చాలా ఇంప్రెసివ్ గా ఉంది. అతని గత చిత్రాల ఇమేజ్ ఈ క్యారెక్టర్ మీద పడకుండా కొత్తగా కనిపించాడు. అలాగే లిప్ట్ లో ఇరుక్కుపోయిన ఫ్యామిలీని హీరో సేవ్ చేసే సీన్ ని చాలా ఉత్కంఠగా మలిచాడు దర్శకుడు. ఒక థ్రిల్లర్, రివేంజ్‌ ఎమోషన్స్‌ని.. ఫ్యామిలీ డ్రామా డామినేట్ చేసింది. నాని సహాజమైన నటన డైలాగ్ డిక్షన్ తో అతను పండించే కామెడీ మరోసారి ఎంటర్‌టైన్ చేశాయి. క్లైమాక్స్‌కి వచ్చేసరికి కథను ముగించాలని దర్శకుడు తీసుకున్న పాయింట్ ఆప్షన్‌లా అనిపించింది. అనిరుథ్ మ్యూజిక్ , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.

చివరిగా:

ప్రతి ఫ్యామిలీ గ్యాంగ్ లో ఇలాంటి లీడర్ ని కోరుకుంటారు. నాని గ్యాంగ్ లీడర్ మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.

-కుమార్ శ్రీరామనేని

Also watch :

Tags

Read MoreRead Less
Next Story