మనమంతా ఒకే సమాజం : ఆరెస్సెస్‌ చీఫ్‌

మనమంతా ఒకే సమాజం : ఆరెస్సెస్‌ చీఫ్‌
X

మంచి ఆలోచనలు చేసే వ్యక్తికి వినాయకుడు మంచి చేస్తాడని ఆరెస్సెస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ అన్నారు. భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జన శోభాయాత్రకు మోహన్‌ భగవత్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. వినాయక నిమజ్జన ఉత్సవాన్ని తిలకించేందుకు తొలిసారి హైదరాబాద్‌ వచ్చిన ఆయన.. ముందుగా చార్మినార్‌ వద్ద ఉన్న భాగ్యలక్ష్మీ ఆలయంలో పూజలు చేశారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మోహన్‌ భగవత్‌ రాక సందర్భంగా చార్మినార్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం చార్మినార్ నుంచి భాగ్యనగర్ ఉత్సవ సమితి ప్రతినిధుల సారథ్యంలో మొజాంజాహి మార్కెట్‌కు వెళ్లారు మోహన్‌ భగవత్‌. అక్కడ వినాయక శోభాయాత్రను తిలకించారు.

ఈ సందర్భంగా గణేశ్‌ ఉత్సవాల గురించి మోహన్‌ భగవత్‌ ప్రసంగించారు.. వినాయకుడు శక్తికి ప్రతిరూపం అన్నారు. భక్తితోనే గణాధ్యక్ష పదవిని పొందిన చరిత్ర వినాయకుడిదన్నారు. గణేశుడి రూపురేఖల్లోనే సమాజ హితం ఉందన్నారు. తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని చెబుతున్నట్లుగా వినాయకుడి చేతిలో పాశం ఉంటుందని ఆయన అన్నారు. భక్తితో పాటు మంచి ఆలోచనలు కూడా ఉండాలన్నారు మోహన్ భగవత్‌. మన అందరి మాత.. భారత మాత అని, జగన్మాతను మించిన దైవం లేదన్నారు.

మన బలాన్ని బుద్ధితో వాడాలని మోహన్‌ భగవత్‌ సూచించారు. మనమంతా ఒకే సమాజానికి చెందిన వారమనే విషయాన్ని మరచిపోకూడదన్నారు. గణేశ్‌ నిమజ్జన శోభాయాత్ర జరిగిన తీరు పట్ల మోహన్‌ భగవత్‌ హర్షం వ్యక్తం చేశారు. శోభాయాత్రలో మోహన్‌ భగవత్‌తోపాటు హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కూడా పాల్గొన్నారు. నిమజ్జనానికి తరలివెళ్లే గణేశుడి విగ్రహాలకు ఇద్దరూ పూజలు చేశారు.

Also watch :

Tags

Next Story