ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌ జలాశయంలో నీటిమట్టం ఎంతో తెలుసా?

ప్రస్తుతం శ్రీశైలం, సాగర్‌ జలాశయంలో నీటిమట్టం ఎంతో తెలుసా?
X

తూర్పు ఏజెన్సీలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ ఏజెన్సీలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.. ప్రధాన రహదారులపైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది.. లంబసింగి ఘాట్‌ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి.. దీంతో నర్సీపట్నం, భద్రాచలం రహదారిలో రాకపోకలకు అంతరాయం కలిగింది.. పలు గిరిజన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.. భారీ వర్షాలకు ఏజెన్సీలోని జలాశయాలు నిండుకుండలా మారాయి..

మరోవైపు నిన్నటి వరకు ఉగ్రరూపం దాల్చిన గోదావరి నది శాంతిస్తోంది.. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ దగ్గర ప్రవాహం నిలకడగా ఉంది. ధవళేశ్వరం దగ్గర 8 అడుగుల నీటిమట్టం ఉండగా.. ఎగువన భద్రాచలం దగ్గర 35.2 అడుగుల మేర ప్రవాహం ఉంది. కాటన్‌ బ్యారేజీ గేట్లను పూర్తిగా ఎత్తి 6 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు బ్యారేజీ దిగువ ప్రాంతంలోనూ వరద తీవ్రత తగ్గుముఖం పట్టింది. ముంపునకు గురైన గ్రామాల్లో ఇప్పుడిప్పుడే దారులు కనబడుతున్నాయి..

నాగార్జున సాగర్‌ జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది.. దీంతో దిగువకు నీటి విడుదల కూడా క్రమేపీ తగ్గుతోంది.. బుధవారం రాత్రి వరకు 22 గేట్ల ద్వారా నీటిని విడుదల చేసిన అధికారులు.. గురువారం సాయంత్రానికి నాలుగు గేట్లకు కుదించారు. ప్రస్తుతం 32వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరికొద్ది గంటల్లో మిగిలిన గేట్లను కూడా పూర్తిగా మూసివేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం సాగర్‌ జలాశయంలో నీటిమట్టం 589.4 అడుగులుగా కొనసాగుతోంది. అటు శ్రీశైలానికీ వరద తగ్గుముఖం పట్టింది.. 2.44 లక్షల క్యూసెక్కుల వరద రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది.. దీంతో శ్రీశైలం నుంచి రెండు గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు లక్షా 28వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. శ్రీశైలంలో 844.4 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు..

ఇక జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది.. 16 గేట్ల ద్వారా శ్రీశైలం రిజర్వాయర్‌కు 1.4 లక్షల క్యూసెక్కుల నీటిని మళ్లిస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కోసం 37వేల క్యూసెక్కులు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకానికి 1500 క్యూసెక్కులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా 2వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే ఎగువ ఆల్మట్టికి 2.1 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. లక్షా 31వేల క్యూసెక్కుల నీరు నారాయణపూర్‌ డ్యామ్‌కు వస్తుండగా.. అంతే మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు..

మరోవైపు ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోంది.. దీంతో లంక గ్రామాల్లో మళ్లీ ముంపు భయం పట్టుకుంది.. దిగువన కృష్ణానది పాయలు వరదతో నిండుగా ప్రవహిస్తున్నాయి.. దీంతో లంక గ్రామాల ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.. వరద కొంత శాంతించినప్పటికీ, నెలరోజుల్లోనే రెండోసారి వరద రావడంతో ఆందోళన చెందుతున్నారు.

Also watch :

Tags

Next Story