ఆ విషయంలో తప్పు ఎవరిది?

ఆ విషయంలో తప్పు ఎవరిది?
X

కాళేశ్వరం ప్రాజెక్టు పెద్దల సభలో వేడి రాజేసింది. ప్రభుత్వ అలక్ష్యం వల్లే ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకుండా పోయిందన్న కాంగ్రెస్ వాదనను తప్పుబట్టారు మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా దక్కని పాపం కాంగ్రెస్ పార్టీదేనంటూ ఫైర్ అయ్యారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై రోజుకో వాదనతో అధికార పార్టీని కార్నర్ చేసే పనిలో ఉంది కాంగ్రెస్. ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు, కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మధ్య శాసన మండలిలో వాడివేడి చర్చ జరిగింది. ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవటానికి రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్నారు జీవన్ రెడ్డి . ఇప్పటివరకు కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ఎలాంటి విఙ్ఞప్తులు రాలేదని రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటించారని జీవన్‌రెడ్డి మండలి దృష్టికి తెచ్చారు. కాళేశ్వరానికి జాతీయ హోదా విషయంలో కేంద్రం చెబుతోంది తప్పా.. రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది తప్పా..? అని ప్రశ్నించారు.

జీవన్ రెడ్డి సందేహాలపై స్పందించిన మంత్రి హరీష్ రావు.. కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రయత్నించలేదన్న ఆరోపణలను కొట్టిపారేశారు. కాళేశ్వరం ప్రాజక్టుకు జాతీయ హోదా దక్కకుండా చేసిన పాపమంతా కాంగ్రెస్‌దేనని అన్నారు. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి,. తెలంగాణలోని ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించాలంటూ సీఎం కేసీఆర్, ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేశారని గుర్తు చేశారు.

Tags

Next Story