కోర్టు తీర్పు ఆ సంస్థకు అనుకూలంగా వస్తే ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏంటి !

కోర్టు తీర్పు ఆ సంస్థకు అనుకూలంగా వస్తే ఏపీ ప్రభుత్వ ఆలోచన ఏంటి !
X

హైకోర్టు తప్పుపట్టినా, కేంద్రం వద్దన్నా వినకుండా పోలవరం రివర్స్ టెండరింగ్‌పై ముందుకే వెళ్తున్న వైసీపీ ప్రభుత్వం దూకుడు దేనికి సంకేతం...? సాంకేతికంగా సమర్థుల్ని ఎంపిక చేయడం కంటే తక్కువ బిడ్‌కు కోట్ చేసేవారికి పనులు అప్పగించాలన్న నిర్ణయం సరైందేనా? బిడ్లు దాఖలుకు గడువు మరో 5 రోజుల్లో ముగుస్తుంది. కొన్ని సంస్థలు గడువు పొడిగించాలని కోరినా ప్రభుత్వం అందుకు సిద్ధంగా లేదు. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఈ రివర్స్ గేర్‌తో లాభం కంటే నష్టమే ఎక్కువన్న వాదన వినిపిస్తోంది.

పోలవరం ప్రాజెక్టు నుంచి నవయుగను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నాక.. కొత్తగా టెండర్లు పిలిచారు. ప్రధాన డ్యామ్‌కి సంబంధించిన పనుల విలువ 1771 కోట్లుగాను, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి 3వేల 216 కోట్లుగానూ ఖరారు చేశారు. ఐతే.. ఈ పార్ట్‌A, పార్ట్‌Bకి కలిపి 4987 కోట్ల రూపాయల పనులకు ఒకే టెండర్లు పిలిచారు. ఇది అక్రమాలకు తెరతీసేలా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి చెందిన వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్‌-WRD పిలిచిన టెండర్‌ను, ఏపీ జెన్‌కో టెండర్‌ను కలిపి నోటిఫికేషన్ ఇవ్వడంపై పలు సందేహాలు ఉత్పన్న మవుతున్నాయి.

ఈ రెండు సంస్థలు వేర్వేరుగా పనులు చేపడుతున్నప్పుడు ఒకే టెండరు ఎలా పిలుస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పైగా.. ఇక్కడ మరో ట్విస్ట్‌ను కూడా ఎత్తి చూపుతున్నారు. పిలిచింది ఒకే టెండర్ అయినా బిడ్ ఖరారు చేశాక.. ఆ కాంట్రాక్టర్ ఈ రెండు సంస్థలతోనూ విడివిడిగా ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే ఒకే కాంట్రాక్టర్‌కు పనులు అప్పగించాలన్న ఆరాటం స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. ఎందుకంటే ప్రధాన డ్యామ్ పనులకు కేంద్రం నిధులు ఇస్తుంది.. పవర్ హౌస్‌ను రాష్ట్ర ప్రభుత్వం చేట్టింది కాబట్టి దీనికి ఏపీ బాధ్యత వహిస్తుంది. ఈ రెండింటికీ కలిపి బిడ్ ఖరారు చేయడం లొసుగులతో కూడిన వ్యవహారంలానే ఉంటుంది. ఇదిలా ఉంటే, పోలవరం జలవిద్యుత్ కేంద్రం ప్రాజెక్టు ఒప్పందం రద్దుపై నవయుగ సంస్థ ఇప్పటికే హైకోర్టుకు వెళ్లింది. దీనిపై వాదనలు కూడా ముగిశాయి. త్వరలో కోర్టు తీర్పు రానుంది. ఈ నిర్ణయం నవయుగకు అనుకూలంగా వస్తే ప్రభుత్వం టెండర్లపై ఏం చేస్తుందన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags

Next Story