అమిత్‌షా వ్యాఖ్యలపై కమల్ హాసన్ కౌంటర్

ఒక దేశం ఒక భాష అంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బలవంతంగా హిందీ భాషను తమపై రుద్దుతున్నారంటూ దక్షిణాదిలో రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కేంద్రం తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తమిళ భాషను తప్ప మరే భాషను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు.
మక్కళ్‌నీది మయ్యం అధినేత కమల్ హాసన్ కూడా అమిత్‌షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. తమపై హిందీని బలవంతంగా రుద్దాలని చూస్తే మరో ప్రతిఘటన ఎదుర్కొక తప్పదని హెచ్చరించారు. తన నిరసనను వీడియో రూపంలో సోషల్ మీడియాకు విడుదల చేశారు కమల్ హాసన్. ఒక దేశం ఒకే భాష విధానం సరైంది కాదన్నారు. జాతీయ గీతం బెంగాలీ భాషలో ఉన్నా అది దేశ ఐక్యతను అన్ని రాష్ట్రాలను, సంస్కృతిని గౌరవిస్తుందని అన్నారు. రాష్ట్రాల సంస్కృతి జోలికి కేంద్రం రావడం మంచిది కాదని కమల్ హాసన్ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. గతంలో జల్లికట్టు ఉద్యమాన్ని ఏ విధంగా ఉధృతం చేశామో దేశమంతా చూసిందని.. తమిళ భాష జోలికి వస్తే అంత కంటే ఎక్కువగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామంటూ కమల్ కేంద్రానికి హెచ్చరికలు చేశారు.
Also Watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com