ప్రమాదం జరిగినప్పుడే అధికారుల హడావుడి

ప్రమాదం జరిగినప్పుడే అధికారుల హడావుడి
X

ప్రమాదం జరిగినప్పుడే హడావిడి చర్యలు.. ఆ తర్వాత అధికారులకు ఏమవుతుంది..? ప్రమాదం జరిగినప్పుడల్లా పదుల సంఖ్యలో సామాన్యుల ప్రాణాలు గోదావరిలో కలిసిపోతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి..? గత అనుభవాల నుంచి అధికారులు ఎందుకు పాఠాలు నేర్చుకోలేకపోతున్నారు..? వారి నిర్లక్ష్యంతో ఇంకెన్ని ప్రాణాలను బలితీసుకుంటారు..? సామాన్యులు అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానమిస్తారు..?

1985లో శ్రీరామగిరిలోని శ్రీరామనవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణమని అప్పట్లో విమర్శలు వచ్చాయి. 1990లో ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి పది మంది చనిపోయారు. ఇక 1992లో ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుల్లంక- భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి తొమ్మిది మంది మృతిచెందారు.

1996లో బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య వైనతేయనదీ పాయపై పడవ దాటుతుండగా వీచిన బలమైన గాలులకు పడవబోల్తా పడి పదిమంది కూలీలు చనిపోయారు. 2004లో యానాం-ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీపాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో పది మంది వరకు మృతి చెందారు. 2007లో ఓడలరేవు-కరవాక రేవు మధ్య ప్రయాణీకులతో వెళుతున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంజిన్‌ చెడిపోవడంతో గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.

2008లో రాజమహేంద్రవరానికి చెందిన లాయర్లు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై మృతి చెందారు. 2009లో అంతర్వేది-బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు మృతి చెందారు. 2018 మే 15న పశ్చిమగోదావరి జిల్లా వాడపల్లి వద్ద లాంచీ మునిగి 19 మంది గిరిజనులు మృతి చెందారు. కండిషన్‌లో లేని లాంచీ వల్లే ఈ ప్రమాదం జరిగింది. 2018 జులై 14న తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం పశువుల లంక రేవులో పడవ ప్రమాదంలో ఆరుగురు విద్యార్థులతోపాటు ఓ మహిళ చనిపోయింది. 2018 మే 11న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి నుంచి లాంచీలో పాపికొండల విహారయాత్రకు బయలుదేరిన 120 మంది మృతువు నుంచి బయటపడ్డారు. అయితే, లాంచీ పూర్తిగా దగ్ధమైంది. వీరవరం గ్రామ సమీపంలో జరిగిన ఈ సంఘటన ప్రయాణికులను భయబ్రాంతులకు గురిచేసింది.

ప్రమాదాలు జరిగినప్పుడు కొద్దిరోజులు హడావిడి చేసే అధికారులు ఆ తర్వాత ప్రయాణికుల భద్రతను ఏమాత్రం పట్టించుకోరు.. బోట్లు, లాంచీలు, పడవలు, పంట్లపై పర్యవేక్షణ ఏమాత్రం ఉండటం లేదు.. అందుకు కచ్చులూరు ప్రమాదమే ప్రత్యక్ష నిదర్శనం. గోదావరిలో నిత్యం తిరుగుతున్న పడవలు, బోట్లు, లాంచీలు, నావలు ఎంతవరకు సురక్షితం..? ఈ ప్రశ్నకు అధికారులు కూడా సమాధానం చెప్పలేరు. పడవలు, లాంచీలపై నిరంతర నిఘా పెట్టి తనిఖీలు చేయాలని పలువురు కోరుతున్నారు.

Tags

Next Story