మొదటి జీతం అందుకుని గణపతికి పూజ చేసి.. అంతలోనే..

ఆడపిల్ల అయినా తండ్రి ఆశయం నెరవేర్చిందని ఎంతో మురిసి పోయారు కుటుంబసభ్యులతో పాటు బంధువులు. తూర్పుగోదావరి జిల్లా హాజీపూర్ మండలం నంనూరుకు చెందిన కారుకూరి రమ్య చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండేది. కారుకూరి సుదర్శన్-భూమక్క దంపతుల కుమార్తె రమ్య. తండ్రి సుదర్శన్ విద్యుత్ సబ్‌స్టేషన్‌లో ఆపరేటర్ కావడంతో కూతురు కూడా ఇదే శాఖలో పని చేయాలని కోరుకున్నాడు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా రమ్య కూడా కష్టపడి చదివింది.. ఏఈగా ఉద్యోగం సాధించింది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ సబ్ డివిజన్‌లో సబ్ ఇంజనీర్‌గా జాయిన్ అయ్యింది. మొదటి జీతం అందుకుని గణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొంది. మంచి జీవితాన్ని ఇచ్చావని గణపతికి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది. ఇది జరిగి పది రోజులైనా కాలేదు.. రమ్య జీవితం గోదారిలో కలిసిపోయింది. స్నేహితులతో కలిసి పాపికొండలకు వెళ్లి అక్కడ జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతయ్యింది. రమ్యకు సోదరుడు రఘు ఉన్నాడు. రమ్య మరణ వార్త తెలిసి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

