పల్నాడులో టెన్షన్.. టెన్షన్

గుంటూరు జిల్లా పల్నాడులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ నేతలు చేపట్టిన భరోసా యాత్ర మరోసారి టెన్షన్ వాతావరణానికి తెర తీసింది. వైసీపీ కార్యకర్తల దాడిలో బాధితులుగా మారిన బీజేపీ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణతో పాటు పలువురు నేతలు భరోసా పేరుతో బయలుదేరారు. గురుజాల ఆర్డీవో కార్యాలయం వద్ద సభ పెట్టారు. అయితే పల్నాడులో ఇప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయని.. ర్యాలీలు, సభలు వద్దని బీజేపీ నేతలకు పోలీసులు సూచించారు. అయితే బీజేపీ వెనకడుగు వేసేది లేదని.. తమ శ్రేణులకు భరోసా ఇచ్చేందుకు వెళ్లితీరతామని కన్నా స్పష్టం చేశారు.
కన్నా ప్రకటనలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉదయం నుంచే పోలీసులు కన్నా ఇంటిముందు మోహరించారు. ఆర్డీవో కార్యాలయం వద్ద తలపెట్టిన సభను వాయిదా వేసుకోవాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. నోటీసులు ఇంటికి అంటించారు. కన్నాకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ప్రయత్నించగా ఆయన నిరాకరించారు. ఇంటి నుంచి కార్యకర్తలతో కలిసి గురజాలకు వెళతానని పోలీసులకు తెగేసి చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

