పరుచూరి రిక్వెస్ట్.. పాపికొండలు పేరును..

అందమైన గోదారమ్మ నదీ ప్రవాహం.. కనువిందైన పాపికొండల నడుమ ప్రవహించే నదీమ తల్లి. తన కడుపులో ఎంతటి విషాదాన్ని దాచుకుంది. పట్టి సీమల అందాలను తిలకిద్దామని గోదారి నదిలో పడవ ప్రయాణం చేశారు. లెక్కకు మించి ఎక్కారు. 2.5 లక్షల క్యూసెక్కుల నీరు ఉంటేనే అనుమతి. అలాంటిది 5 లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంటే.. అనుమతులు లేవని చెబుతున్నా కూడా వినకుండా రికమండేషన్లు ఉన్నాయంటూ అందరూ పడవెక్కేశారు. బరువుకి పడవ బోల్తా పడింది. గోదారి తన ఒడిలో కొందర్ని కలిపేసుకుంది.
అయిన వారిని పోగొట్టుకున్న ఆర్తనాదాలతో గోదావరి నదీ పరివాహక ప్రాంతం దద్దరిల్లుతోంది. చివరి చూపైనా దక్కుతుందేమోనని కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు బంధువులు రేయింబవళ్లు నది ఒడ్డునే ఉండి. అయిన వారి జాడ కోసం అక్కడే పడిగాపులు కాస్తున్నారు. గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. జరిగిన దుర్ఘటనపై సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ స్పందించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడం బాధాకరమని వ్యాఖ్యానించారు.'పాపికొండలు'అనే పేరు ఒక అపశబ్దమని ఆయన అభిప్రాయపడ్డారు.
అసలు పేరు'పాపిడికొండలు'అని.. మహిళ పాపిడి తరహాలో రెండు కొండల నడుమ నది ప్రవాహం ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చిందని ఆయన వివరించారు. కాలక్రమంలో అది కాస్తా పాపికొండలుగా మారిపోయిందని తెలిపారు.ఒకవేళ పాపిడికొండలు పేరు నచ్చకకపోతే.. రాముడు, సీత, హనుమంతుడు లేదా భద్రాద్రి పేరుతో పాపికొండల పేరు మార్చాలని ఆయన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అపశబ్ధం అనేది ఎవరికీ శుభప్రదం కాదని ఆయన అన్నారు. భోజనం చేయడానికని లైఫ్ జాకెట్లు తీసిన వారు.. భోజనం చేయకుండానే కన్నుమూశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు అక్కడ ప్రైవేటు బోట్లు నడపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి పరుచూరి సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com