ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్రలో పాల్గొంటా - జనసేనాని

ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు పాదయాత్రలో పాల్గొంటా - జనసేనాని
X

అభివృద్ధి పేరుతో నల్లమల ధ్వంసం అవుతుంటే ఎవరూ మాట్లాడటం లేదని జనసేన అధినేత పవన్ మండిపడ్డారు. పర్యావరణం నాశనం అవుతుంటే బాధ కలుగుతోందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పవన్‌ పాల్గొన్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను తక్షణం నిలిపివేయాలని తీర్మానించారు. ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు అఖిలపక్షం చేపట్టే పాదయాత్రలో పాల్గొంటానని జనసేనాని చెప్పారు.

నల్లమలలో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణం నిలిపేయాలని అఖిలపక్ష పార్టీల రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో నేతలు తీర్మానించారు. కాంగ్రెస్, జనసేనతో పాటు పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు హైదరాబాద్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాయి. ఈ సమావేశంలో పలువురు నిపుణులు, పర్యావరణ వేత్తలు, ఎన్జీఓలు, శాస్త్రవేత్తలు, నల్లమల వాసులతో పాటు ఉద్యమకారులు పాల్గొన్నారు. నల్లమలలో యురేనియం తవ్వకాలను నిలిపేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు.

కేంద్రం నిర్ణయాన్ని విపక్ష నేతలతో పాటు పలువురు నిపుణులు, పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలతో పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని.. జీవవైవిధ్యం నాశనమవుతుందని, కృష్ణా జలాలు కలుషితమవుతాయని.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముప్పు ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్గొండ జిల్లాలో యురేనియం అన్వేషణ అంశం కూడా రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. దీని వల్ల గతంలో ప్రజలకు అపార నష్టం కలిగిందని నేతలు గుర్తుచేశారు. అఖిలపక్షం సూచించిన డిమాండ్లకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వానికి సూటి హెచ్చరికలు చేశారు. చిల్లర రాజకీయాలు చేయడానికి తాను రాలేదన్నారు. అడవిని ధ్వంసం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. తనకు ఒక్క ఎమ్మెల్యే సీటు రాకపోయినా మంచిదే కానీ.. ప్రజలు కన్నీరు పెడితే ఊరుకోనని అన్నారు. జనాల కన్నీళ్లు తుడుస్తానని, అఖిలపక్ష పార్టీ చేపట్టే పాదయాత్రలో పాల్గొంటానని పవన్ ప్రకటించారు.

Also watch :

Tags

Next Story