డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు

నాణ్యమైన బియ్యం పంపిణీకి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పౌర సరఫరాల శాఖపై సమీక్ష నిర్వహించిన జగన్.. శ్రీకాకుళంలో నాణ్యమైన బియ్యం సరఫరా ఎలా జరుగుతోందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి మంచి స్పందన ఉందని.. బియ్యం సరఫరా సాఫీగా సాగుతోందని అధికారులు సీఎంకు తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాల్లో నాణ్యమైన బియ్యం సరఫరా చేసేందుకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని.. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
ప్రజలు తినగలిగే నాణ్యమైన బియ్యాన్ని సేకరించేలా ఇప్పటి నుంచి ప్రణాళిక వేసుకోవాలని అధికారులను ఆదేశించారు జగన్. శ్రీకాకుళం జిల్లా స్ఫూర్తితో ఏప్రిల్ 1 నుంచి అన్ని జిల్లాలకు నాణ్యమైన బియ్యం పంపిణీ జరిగేలా కార్యచరణను సిద్ధం చేయాలన్నారు. క్వాలిటీ విషయంలో రాజీ పడొద్దన్నారు. అలాగే రేషన్ బియ్యం సరఫరా చేస్తున్న సంచులను రీసైక్లింగ్ కోసం తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు ముఖ్యమంత్రి జగన్.
కొత్త రేషన్‌కార్డు జారీకి కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ ఒకటి నుంచి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. లబ్దిదారులను త్వరితగతిన ఎంపిక చేయాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి కొడాలి నాని, సివిల్ సప్లైస్ కమిషనర్ కోన శశిధర్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com