బోటులో ఉన్న మృతదేహాలను చేపలు..

గోదావరి బోటు గాలింపులో అయోమయం నెలకొంది. ఇంత వరకు బోటు వెలికితీత పనులు ప్రారంభం కాలేదు. పోర్టు అధికారుల నుంచి బోటు వెలికితీతకు అనుమతులు రాలేదంటూ.. ఘటనా ప్రాంతంలో తాపీగా కూర్చుండిపోయారు అధికారులు. తామే బోటు బయటకు తీస్తామన్నా.. పట్టించుకోవడం లేదని అటు మత్స్యకారులు మండిపడుతున్నారు. బోటు గల్లంతై ఐదు రోజులు గడుస్తున్నా.. అధికారుల హంగామా మాత్రమే కనబడుతుందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదం జరిగి 5 రోజులు కావడంతో... బోటులో ఉన్న మృతదేహాలను చేపలు తినేసి శిధిలమయ్యే అవకాశం కనిపిస్తోంది.
సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొలిక్కిరాలేదు. ఇప్పటికి 35 మృతదేహాలు దొరగ్గా.. మిగతా 12 మంది ఏమయ్యారో తెలియడం లేదు. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద పరిస్థితి హృదయవిదారకంగా ఉంది. నిద్రాహారాలు మాని తమ వాళ్ల మృతదేహాల కోసం ఎదురు చూస్తున్న బంధువుల్ని ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు. ప్రభుత్వం భరోసా ఇస్తున్నా రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతుండడంతో ఆందోళనలో ఉన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా ఐ పోలవరం మండలం ఎదుర్లంక సమీపంలోని గౌతమీ గోదావరి తీరంలో ఓ వ్యక్తిమృతదేహం లభ్యమైంది. బోటు బయటపడితే తప్పా మిగతా వారి డెబ్ బాడీలు దొరకడం కష్టంగానే కనిపిస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com