గడగడలాడిస్తున్న ఉల్లిగడ్డ.. కేజీ ధర

వంటకాల్లో అతిముఖ్యమైనది ఉల్లిగడ్డ. ప్రస్తుతం ఉల్లికి రెక్కలొచ్చాయి.. ఉల్లిధరలు సామాన్యులను గడగడలాడిస్తున్నాయి. దిగుబడి తగ్గడంతో ఉల్లిధర ఆకాశాన్నింటింది. ఇప్పటికే తెలుగురాష్ట్రాల్లో క్వింటాల్‌కు 4500 రూపాయలు పలుకుతోంది. గత కొన్నిరోజులుగా ఉల్లి దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ఉల్లిగడ్డ సరఫరా అవుతుంది. అయితే రెండునెలలుగా దేశవ్యాప్తంగా వరదలు వచ్చాయి.. ఆంధ్ర, తెలంగాణాలో ఇటీవల భారీ వర్షాలు కురిశాయి. దాంతో నీటమునిగి ఉల్లిపంట పాడైపోయింది..
కొన్ని ఏరియాల్లో వర్షాలకు ఉల్లిగడ్డలు కుళ్లిపోయాయి. ఈ కారణంగా హైదరాబాద్ నగరానికి ఉల్లి దిగుమతి భారీగా తగ్గింది. సాధారణంగా హైదరాబాద్ నగరానికి రోజుకు 75 నుంచి 150లారీల ఉల్లిగడ్డ దిగుమతి అవుతుండగా.. ప్రస్తుతం 30 నుంచి 40లారీల పరిమితమైంది. దీంతో ఉల్లి కొరత ఎక్కువైంది. ఈ క్రమంలో ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. హైదరాబాద్ నగరంలో నెల రోజుల క్రితం కేజీ రూ.10 పలికిన ఉల్లిగడ్డ.. గురువారం 50 నుంచి 60 రూపాయలు పలికింది. కేవవలం నెల రోజుల్లోనే 60రూపాయలకు చేరడంతో కొనుగోలు దారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com