వరంగల్‌ జిల్లా కోర్టు మరో సంచలన తీర్పు..

వరంగల్‌ జిల్లా కోర్టు మరో సంచలన తీర్పు..

వరంగల్‌ జిల్లా కోర్టు మరో సంచలన తీర్పు వెల్లడించింది. 2017లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి జీవితఖైదు విధించింది. కోర్టు తీర్పుతో బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విచారణ దాదాపు రెండేళ్ల పాటు సాగింది. విచారణలో నేరం రుజువు కావడంతో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి దోషికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.

2017 డిసెంబర్‌లో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం గోరికొత్తపల్లి గ్రామంలో ఆరేళ్ల చిన్నారి రేష్మపై కటకం శివ అనే యువకుడు కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశాడు. ఆ తరువాత బాలికను అత్యంత దారుణంగా హతమార్చాడు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. వెంటనే నిందితున్ని అరెస్ట్‌ చేసిన పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. ఎట్టకేలకు రెండేళ్ల తరువాత ఆ మానవ మృగానికి శిక్ష పడింది.

గత నెలలో హన్మకొండలో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య కేసులో కూడా వరంగల్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. చిన్నారిని చిదిమేసిన ప్రవీణ్‌కు ఉరిశిక్ష విధిస్తూ... జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్‌ చారిత్రక తీర్పు ఇచ్చారు. నేరం జరిగిన 48రోజుల్లోనే దోషికి ఉరిశిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా 2017 అత్యాచారం కేసుపై కూడా త్వరగా విచారణ పూర్తి చేసి దోషికి శిక్ష పడేలా చేయడంపై అందరూ స్వాగతిస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story