భార్యకు వీడియోకాల్ చేసిన భర్త.. ఆమె చూస్తుండగానే..

ఆ జంట మూడు ముళ్ల బంధం మూడు నెలలు కూడా నిలబడలేదు. కాళ్లపారాణి ఆరకముందే ఓ భార్య తన కళ్ల ముందే భర్త ఆత్మహత్యను ప్రత్యక్షంగా చూడాల్సివచ్చింది. వివాహబంధం కళ్ల ముందే తెగిపోతుంటే ఏమీ చేయలేక నిశ్చేష్టురాలై చూస్తూ ఉండిపోయింది ఆ భార్య. హృదయ విదారకరమైన ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగింది.
మహేందర్.. సింగరేణిలో ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు. మూడు నెలల క్రితం శిరీషతో పెళ్లయింది. సంతోషంగా సాగిపోతున్న సంసారంలో మధుమేహం చిచ్చుపెట్టింది. షుగర్ వ్యాధి ఇద్దరినీ తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. మహేందర్ షుగర్‌తో బాధపడుతూ రోజూ ఇన్సులిన్ తీసుకునేవాడు. ఇటీవల ఇద్దరికి జ్వరం రావడంతో భార్యను పుట్టింటికి పంపాడు
మహేందర్. డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చిన మహేందర్ తన భార్యకు వీడియో కాల్ చేశాడు. మధుమేహం వల్ల అవస్థలు పడలేనంటూ భార్యకి వీడియో కాల్ చేసి ఆమె చూస్తుండగానే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కళ్లముందే వేలాడుతున్న భర్తను చూసి శిరీష షాకైంది. అంతలోనే కోలుకొని చుట్టుపక్కల వారికి సమాచారం అందించింది. వారు వచ్చి చూసేసరికి మహేందర్ విగతజీవిగా కనిపించాడు. కళ్ల ముందే భర్త ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేక శిరీష కన్నీరుమున్నీరవుతోంది. ఆమె ఆవేదన స్థానికులను కంటతడిపెట్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com