అడవిలో మళ్ళీ అలజడి.. ముగ్గురు మావోయిస్టుల హతం

అడవిలో మళ్ళీ అలజడి.. ముగ్గురు మావోయిస్టుల హతం
X

విశాఖ ఏజెన్సీ తుపాకుల మోతతో మరోసారి దద్దరిల్లింది. జీకే వీధి మండలం గుమ్మిరేవుల అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. అందులో ఇద్దరు కీలక నేతలు ఉన్నట్టు ఇప్పటికే గుర్తించారు..

ముగ్గురు మావోల్లో ఇద్దరు మహిళలు ఉన్నట్టు నిర్ధారించారు. అందులో ఒక ఆమె కీలక మావో నేత అరుణగా గుర్తించారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం కాకరవాని పాలెంకు చెందిన ఆరుణ మావోయిస్టు మిలటరీ సెక్రటరీగా పని చేస్తోంది. మరో కీలక నేత మావో కేంద్ర కమిటీ సభ్యులు చలపతి భార్య అరుణ.. ఈ ఎన్‌కౌంటర్‌లో అరుణతో పాటు మరో కీలక నేత డివిజనల్‌ కమిటీ సభ్యుడు జగన్‌ అలియాస్‌ కాకురి పెద్దన్న హతమైనట్టు పోలీసులు నిర్ధార్దించారు.

ఎదురుకాల్పుల తరువాత సంఘటనా స్థలంలో ఏకే 47 గన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మావోల వారోత్సవాల నేపథ్యంలోనే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగింది. విశాఖ మన్యంలో రెండు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు ఎన్‌కౌంటర్ జరగడంతో గిరిజనలు హడలిపోతున్నారు.

మరోవైపు తూర్పుగోదావరి జిల్లాలో మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. చింతూరు మండలంలోని తుమ్మల, సరివెల్ గ్రామాల్లో ఈ పోస్టర్లు ఉన్నాయి. మావోయిస్టులారా ఎందుకు ఈ ఆవిర్భావ దినోత్సవాలు! అమాయక ప్రజలను చంపడానికా అంటూ గిరిజన నాయకుల పేరిట పోస్టర్లు వెలిశాయి.

Tags

Next Story