అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు..

నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో అనంతపురం జిల్లా తడిసిముద్దయింది. ఉరవకొండ నియోజకవర్గంలోని గ్రామాల్లో ఎటు చూసినా మోకాలి లోతులో నీళ్లు కనిపిస్తున్నాయి. ఉరవకొండ, గుంతకల్, ఛాయాపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దోనేకళ్ వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బళ్లారి జాతీయ రహదారి 63పై రాకపోకలు స్తంభించాయి.
భారీ వర్షాల వల్ల ఉల్లి,పత్తి, వేరుశెనగ పంటలు కొన్ని చోట్ల పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా నీటమునిగాయి. నింబగల్లు గ్రామంలో పురాతన శివాలయం నీట మునిగింది. మోపిడీగ్రామంలో PABR లింక్ ఛానల్ బ్రిడ్జ్ కూలిపోవడంతో గ్రామస్తులు పొలాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా భారీ వర్షం పడితే లింక్ ఛానెల్ గేట్లు కూడా ఊడిపోయే ప్రమాదం ఉందంటున్నారు స్థానికులు
తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి మండలంలో కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాలు జలమయమయ్యాయి. పిన్నేపల్లి చెరువుకు భారీగా నీరు చేరింది. మండల కేంద్రంలోని ఇళ్లలో వరదనీరు వచ్చి చేరడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ చేనేత కార్మికులు ఎక్కువగా ఉండటంతో వర్షంవల్ల తీవ్రంగా నష్టపోయారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com