డీజీపీకి లేఖ రాసిన టీడీపీ అధినేత చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలిగిందంటూ డీజీపీకి లేఖ రాశారు టీడీపీ అధ్యక్షుడు, విపక్షనేత చంద్రబాబు. ఏపీ చరిత్రలో ఇంతగా శాంతిభద్రతలు క్షీణించడం ఇదే ప్రథమమన్నారాయన. వైసీపీ నేతలు.. రాజ్యాంగాన్ని, ప్రాథమిక హక్కుల్ని కాలరాస్తున్నారంటూ లేఖలో వివరించారు. గత 4 నెలలుగా.. రాష్ట్రంలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హరించుకుపోయిందన్నారు. మీడియా సంస్థలు, ప్రతినిధులపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. టీవీ5, ఏబీఎన్ ఛానెళ్ల ప్రసారాల్ని నిలిపేశారని, ఈ మేరకు ప్రభుత్వమే ఎమ్మెస్వోలపై ఒత్తిడి తెచ్చిందంటూ లేఖలో పేర్కొన్నారు.
ఇక.. సోషల్ మీడియాతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపైనా దాడులు చేస్తున్నారంటూ మండిపడ్డారు చంద్రబాబు. ఈ సందర్భంగా చీరాలలో జర్నలిస్ట్ నాగార్జునరెడ్డిపై జరిగిన దాడిని లేఖలో వివరించారు. ఆమంచి కృష్ణమోహన్ కుటుంబం వల్ల ప్రాణహాని ఉందని నాగార్జున రెడ్డి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడని, అదే రోజే అతన్ని కిడ్నాప్ చేసి దారుణంగా కొట్టారన్నారు. ప్రస్తుతం నాగార్జునరెడ్డి ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య ఉన్నాడని లేఖలో తెలిపారు చంద్రబాబు.
నాలుగు నెలలుగా ఏపీ పోలీసులు.. ప్రజల ఫిర్యాదులు తీసుకోవడం లేదని లేఖలో తెలిపారు చంద్రబాబు. వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై సోషల్ మీడియా కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకురావాలని డీజీపీని కోరారు. సత్యమేవ జయతే అన్న సిద్ధాంతాన్ని పాటించాలని, ప్రజల్లో నమ్మకం కలిగించేలా పోలీసులు వ్యవహరించాలని కోరారు చంద్రాబాబు.
Also watch :
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com