నగరంలో సముద్రం! మేఘాలన్నీ కట్టగట్టుకొని..

నగరంలో సముద్రం! మేఘాలన్నీ కట్టగట్టుకొని..

హైదరాబాద్‌ నగరంలో డ్రైనేజీ వ్యవస్థకు రెండు సెంటీమీటర్ల వర్షాన్ని మాత్రమే తట్టుకునే కెపాసిటీ ఉంది.. కానీ, నిన్న కురిసిన వర్షం 12 సెంటీమీటర్లకంటే ఎక్కువే.. మేఘాలన్నీ కట్టగట్టుకుని నగరంపై వర్షాన్ని కుమ్మరించడంతో లోతట్టు ప్రాంతాలు వరద దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. కొన్నిచోట్ల 12 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.. దీంతో జీహెచ్‌ఎంసీ అధికారులు చేతులెత్తేశారు.. ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తూనే ఉండటంతో సహాయక చర్యలు మొదలు పెట్టేలోపే రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. తిరుమలగిరిలో అత్యధికంగా 12.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.. ఉప్పల్‌లో 12, మారేడ్‌పల్లి, ముషీరాబాద్‌లో 11.4, మల్కాజ్‌గిరిలో 11 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బాలానగర్‌లో 10.4 సెంటీమీటర్లు, సికింద్రాబాద్‌లో 10.3, షేక్‌పేట్‌లో 8.8 ఖైరతాబాద్‌లో 8.5, శేరిలింగంపల్లిలో 7.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మేయర్‌ బొంతు రామ్మోహన్‌ వరద సహాయక చర్యలను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీలోని కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి వరద పరిస్థితిని సమీక్షించారు.. సహాయక బృందాలు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ నుంచే సూచనలు చేశారు. వర్షం తగ్గిన తర్వాత పంజాగుట్ట, ఖైరతాబాద్‌ ప్రాంతాల్లో పరిస్థితిని స్వయంగా పరిశీలించారు.. ఖైరతాబాద్‌ రైల్వే ట్రాక్‌ సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో మాన్సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు నిర్వహిస్తున్న విధులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. డిప్యూటీ మేయర్‌ బాబా ఫసీయుద్దీన్‌ బోరబండ, సికింద్రాబాద్‌ చిలకానగర్‌ ప్రాంతాల్లో పర్యటించి సహాయక బృందాలకు పలు సూచనలు చేశారు.

మరోవైపు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ నీరంతా హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చి చేరుతోంది.. దీంతో ట్యాంక్‌ బండ్‌ దగ్గర హుస్సేన్‌ సాగర్‌ ప్రమాదకరస్థాయికి చేరింది. నీటిమట్టం గరిష్ట స్థాయి దాటింది. సాగర్‌ గరిష్ట నీటిమట్టం 513.41 మీటర్లు కాగా.. ప్రవాహం అంతకు ఎక్కువే ఉంది.. ఇప్పటికే కొన్ని గేట్ల ద్వారా నీటిని దిగువకు వదులుతున్నారు అధికారులు.. హుస్సేన్‌ సాగర్‌ నుంచి పెద్ద మొత్తంలో నీరు దిగువకు వస్తుండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సాగర్‌ నీరంతా ఎక్కడ తమ కాలనీలను ముంచెత్తుతుందోనని భయపడిపోతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story