హైదరాబాద్‌లో ఇలాంటి రోడ్లుంటే ఇక ఎంత వర్షం పడినా నో ప్రాబ్లమ్!

హైదరాబాద్‌లో ఇలాంటి రోడ్లుంటే ఇక ఎంత వర్షం పడినా నో ప్రాబ్లమ్!

మహానగరమైన హైదరాబాద్‌లో చినుకు పడితే చాలు.. రోడ్లపై వరద పారాల్సిందే. పది నిమిషాలు వాన పడితే చాలు.. రోడ్లపై నీరు నిలిచిపోతుంది! ఇక వర్షం పడిన తరువాత ప్రజలు పడేపాట్లు అన్నీఇన్నీ కావు. ఎక్కడి నీరు అక్కడ ఉండిపోయి.. నీరు ఇంకే దారి లేక అవి చెరువులను తలపిస్తాయి. అయితే రోడ్డు విస్తరణ పేరుతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న చిన్నపాటి మట్టి రోడ్డుని కూడా తారు రోడ్డుగా మారుస్తున్నారు. దీనివల్ల వర్షపు నీరు భూమిలో ఇంకే పరిస్థితి ఉండటం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ సమస్యల పరిష్కారానికి కొంతకాలంగా ప్రయోగాలు చేస్తోన్న జీహెచ్‌ఎంసీ.. పర్మియబుల్‌ సిమెంట్‌ కాంక్రీట్‌ రోడ్‌ నిర్మాణానికి సిద్ధమైంది. అంటే వాన నీరు ఇంకిపోయే సరికొత్త రోడ్డు నిర్మాణం చేపట్టింది జీహెచ్‌ఎంసీ. పర్మియబుల్ రోడ్డు అంటే.. ఓ రకంగా ఇంకుడు రోడ్డు అని అంటున్నారు అధికారులు. ఇంజనీర్లు దీనినే పర్వియస్‌ కాంక్రీట్, పోరస్‌ కాంక్రీట్‌ అని కూడా వ్యవహరిస్తారు.

ఈ పర్మియబుల్‌ రోడ్‌ నిర్మాణంలో ఇసుక వాడరు. దీంతో రోడ్డుపై పడ్డ వర్షపు నీరు రోడ్డుకుండే రంధ్రాల ద్వారా నేరుగా భూమిలోకి వెళ్తుంది. ఇలాంటి రోడ్లతో భూగర్భ జలమట్టం కూడా పెరుగుతుందని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కిలోమీటర్ కి రూ.30 లక్షల ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు అధికారులు. అయితే పైలట్‌ ప్రాజెక్టుగా కాటేదాన్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో 20 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పుతో ఈ రోడ్డు పనులు చేపట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి రోడ్డు ఎక్కడా లేదంటున్నారు అధికారులు.

హైదరాబాద్‌లో ఇలాంటి రోడ్లుంటే ఇక ఎంత వర్షం పడినా నో ప్రాబ్లమ్ అని జీహెచ్‌ఎంసీ అధికారులు చెబుతున్నారు. దీనివల్ల రోడ్లపై వర్షం నీటి సమస్య ఉండదని.. గ్రౌండ్‌ వాటర్‌ రీఛార్జ్‌ అవుతుందని అధికారులు వివరిస్తున్నారు.

Also watch :

Tags

Read MoreRead Less
Next Story