సీమల్లో కరువుతీరా వర్షాలు.. గుత్తిలో కప్పల వాన..

సీమల్లో కరువుతీరా వర్షాలు.. గుత్తిలో కప్పల వాన..
X

కొన్ని ఏళ్ల తర్వాత సీమ జిల్లాల్లో కరువుతీరా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడు లేనంతగా నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వాగులు ఉప్పొంగుతున్నాయి. చెరువులు జలకళతో కనిపిస్తున్నాయి. అయితే..కుండపోత వానతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు తిప్పలు తప్పటం లేదు.

వర్షాలకు కర్నూలు జిల్లాలోని వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఆలూరు నియోజకవర్గంలో వేదవతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి. మరికొన్ని చోట్ల తాత్కాలిక వంతెనలు తెగిపోయాయి. కర్నూలు-బళ్లారి మధ్య వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు అనంతపురం జిల్లావాసుల్లో ఆనందాన్ని నింపాయి. పదేళ్లలో ఎన్నడూ లేని వర్షపాతం నమోదవడంతో కరువు తీరిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లోను కురిసిన వర్షాలకు కోన ఉప్పలపాడుకు వరద పోటెత్తింది. ఇక్కడి జలపాతాన్ని చూడడానికి పర్యాటకులు క్యూ కడుతున్నారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ప్రమాదాలు జరక్కుండా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.

అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. గుత్తిలో కుప్పలు, కుప్పలుగా కప్పలు పడ్డాయి. స్థానికులు వీటిని వింతగా చూస్తున్నారు.

యాడికి మండలం ప్రజలు కుండపోత వర్షాలతో ఇబ్బందులు పడుతున్నారు. 40 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా వర్షం నమోదు కావటంతో పిన్నేపల్లి చెరువుకు గండి పడింది. దీంతో యాడికిలోని చౌడేశ్వరి కాలనీ, టీచర్స్ కాలనీ, హస్పిటల్ కాలనీ, చెన్నకేశవ కాలనీలు జలమయం అయ్యాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నా రెవెన్యూ అధికారులు మాత్రం స్పందించటం లేదు. డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

పుట్టపర్తిలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్ని జలమయం అయ్యాయి. మొన్నటి వరకు తేలికపాటి వర్షాలు కురిసినా..నిన్న భారీ వర్షం కురియటంతో చెరువుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

ఇక సుంకేసుల రిజర్వాయర్‌ కు వరద తాకిడి పెరిగింది. జలాశయం పూర్తిగా నిండిపోయింది. ఇంకా 90 వేల క్యూసెక్కులు వస్తుండడంతో అధికారులు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. అటు తుంగభద్రకు వరద ఉధృతి పెరిగింది. సుంకేసులతో పాటు తుంగభద్ర నుంచి వరద భారీగా వస్తుండడంతో శ్రీశైలం నిండుకుండలా మారింది. ఈ ప్రాజెక్ట్‌ గరిష్ట నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 884 అడుగుల నీటిమట్టం కొనసాగుతోంది. అధికారులు జల విద్యుత్‌ కొనసాగిస్తున్నారు. సాగునీటి కాల్వలకు 80 వేల క్యుసెక్కులను విడుదల చేస్తున్నారు.

Tags

Next Story