హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..

హైదరాబాద్‌లో మరోసారి భారీ వర్షం.. జనజీవనం అస్తవ్యస్తం..

హైదరాబాద్‌ నగరంలో వరుసగా రెండో రోజు భారీ వర్షం కురిసింది. ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, అమీర్‌పేట, SR నగర్‌, ఎర్రగడ్డ, యూసుఫ్‌గూడ, మలక్‌పేట్‌, చాదర్‌ఘాట్‌, సైదాబాద్‌, సంతోష్‌నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, LB నగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ ప్రాంతాలను భారీ వర్షం ముంచెత్తింది.. సాయంత్రానికి ఆకాశమంతా నల్లని మేఘాలు ఆవరించాయి.. చిన్నపాటి చినుకులతో మొదలై కుండపోతగా కురిసింది.. మూడు గంటలపాటు ఆగకుండా కురిసింది.. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల ఇళ్లలోకి వరద నీరు ప్రవేశించింది. అపార్ట్‌మెంట్లలో సెల్లార్లు నీట మునిగాయి. కొన్ని కాలనీల్లో రోడ్లు నదులు, వాగులను తలపించాయి. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు చేరింది.

భారీ వర్షంతో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోయాయి.. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో ట్రాఫిక్‌ జంజాటాలను తెచ్చిపెట్టింది.. కూకట్ పల్లి, కోఠి మార్గంలో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఐటీ కారిడార్‌లోనూ భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. హైటెక్‌సిటీ నుంచి జేఎన్‌టీయూ వరకు పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో వాహనదారులు నరకం చూశారు. అటు మాదాపూర్‌లో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. రోడ్లపై నిలిచివున్న నీటిని తొలగించిన జీహెచ్‌ఎంసీ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ పోలీసులు.. వాహనాలను మళ్లించారు. 13 రెస్క్యూ టీమ్‌లు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి..

శంషాబాద్‌ను కుండపోత వర్షం ముంచెత్తింది. రెండు గంటల పాటు కురిసిన భారీ వర్షానికి శంషాబాద్ విమానాశ్రయం పరిసర ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ఉరుములు, మెరుపులకు తోడు ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోతగా వర్షం కురవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే దారితో పాటు శంషాబాద్- రాళ్లగూడ రోడ్డుపై మోకాళ్ల లోతు వరద నీరు ప్రవహించింది. దీంతో వాహనదారులు, పాదాచారులు అవస్థలు పడ్డారు. ఎయిర్ పోర్ట్ వెళ్ళే దారి కావడంతో వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది.. అయితే, భారీగా వరద నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. కుండపోత వర్షానికి శంషాబాద్ సహా మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

నగరంలో భారీ వర్షం నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఆఫీసులో కమిషనర్ లోకేశ్ కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం ద్వారా సహాయక చర్యలను పర్యవేక్షించారు. జోనల్‌, డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను సమీక్షించాలని ఆదేశించారు. కాల్‌ సెంటర్ ఏర్పాటు చేశామని, వర్షం వల్ల ఏదైనా ఇబ్బందులు ఏర్పడితే ప్రజలు 040-211 111 111 కు గానీ, ఎమర్జెన్సీ నంబర్ 100కు డయల్‌ చేయాలని సూచించారు.

ఇక ఉస్మాన్‌ గంజ్‌లో వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి.. వాహనాలను ఆపేందుకు ప్రయత్నించిన వారు కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయారు.. దీంతో స్థానికులు అప్రమత్తమై వారిని రక్షించారు.. అయితే, వాహనాలు మాత్రం వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇక బహదూర్‌పురాలో భారీ వర్షానికి ఇల్లు కూలడంతో మహిళ మృతిచెందింది. కొండాపూర్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో విద్యుత్ స్తంభానికి కరెంట్ సరఫరా అయింది. దీన్ని పట్టుకున్న ఆడంమార్క్ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. కృష్ణానగర్‌లో ఓ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయింది. ప్రజలు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లకు దూరంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ విజ్ఞప్తి చేశారు.

Tags

Next Story