'ఐఏఎస్' ఆఫీసర్.. ఓ సామాన్య పౌరుడిలా..

అతనో ఐఏఎస్ ఆఫీసర్.. ఎక్కడికి వెళ్లాలన్నా కారు.. ఆయనతో పాటు సెక్యూరిటీ.. ఆర్డర్ వేస్తే అన్నీ కళ్లముందుంటాయి. అయినా అవేమీ వద్దని అధికార దర్పాన్ని పక్కన పెట్టి ఓ సాధారణ వ్యక్తిలా కూరగాయల అంగడికి వచ్చి మంచివి ఎంచుకున్నారు. కూరగాయల అమ్మి అడిగినంతా ఇచ్చి ఆమె కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. తనతో పాటు భార్యా బిడ్డలను కూడా తీసుకెళ్లారు. వారానికి సరిపడా కూరగాయలు తెచ్చుకున్నారు. క్షణం తీరికలేని ఓ ఐఏఎస్ ఆఫీసర్‌కి అంత టైమ్ ఎక్కడవుంటుంది అని అంటే సమయం మన చేతుల్లోనే ఉంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవడంలోనే మన ప్రతిభ బయటపడుతుందంటారు ఈ ఆఫీసర్.
మేఘాలయకు చెందిన ఐఏఎస్ ఆఫీసర్ రామ్‌సింగ్ ప్రతి వారం స్థానికంగా ఉన్న తూరా అనే ప్రదేశానికి 10 కి.మీ నడిచి వెళ్లి మరీ కూరగాయలు తెచ్చుకుంటారు. ప్రస్తుతం ఆయన వెస్ట్‌గారో హిల్ప్ అనే ప్రాంతానికి డిప్యూటీ కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. తూరా ప్రాంతంలో క్రిమిహారక మందులు వేయకుండా కూరగాయలు పండించి అమ్ముతుంటారు. నడక ఆరోగ్యానికి మంచిదని, దాంతో పాటు కూరలూ తెచ్చుకోవచ్చని భార్యని తీసుకుని వెళుతుంటారు వారానికి ఒకసారి. పైగా వాటిని తానే స్వయంగా మోసుకొస్తుంటారు.
ప్లాస్టిక్ పర్యావరణానికి హానికరమని వెదురుతో చేసిన బుట్టను వెనుక తగిలించుకుని మార్కెట్‌కు వెళుతుంటారు. ఫిట్ మేఘాలయ, ఫిట్ ఇండియా, ఈట్ ఆర్గానిక్ అనేవి ఆయన సూత్రాలు. గత వారం ఆయన మార్కెట్‌కి వెళ్లి వస్తుంటే ఓ వ్యక్తి ఫొటోలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో.. అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఈ విధంగా ఐఏఎస్ ఆఫీసర్ రామ్‌సింగ్ సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. ఆయన సింప్లిసిటీకి మెచ్చి నెటిజన్స్ రామ్‌సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com