26 Sep 2019 6:51 AM GMT

Home
 / 
అంతర్జాతీయం / మెహుల్‌ చోక్సీ పై...

మెహుల్‌ చోక్సీ పై ఆంటిగ్వా ప్రధాని సంచలన వ్యాఖ్యలు

మెహుల్‌ చోక్సీ పై ఆంటిగ్వా ప్రధాని సంచలన వ్యాఖ్యలు
X

పీఎన్‌బీ స్కాం కీలక నిందితుడు మెహుల్‌ చోక్సీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. భారత్‌లో భారీ కుంభకోణానికి పాల్పడి ఆంటిగ్వా పారిపోయి.. అక్కడి పౌరసత్వంతో ఎంజాయ్‌ చేస్తున్న చోక్సీపై దొంగ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్ బ్రౌన్. మెహుల్ చోక్సీ ఒక మోసగాడు, వంచకుడని మండిపడ్డారు. అతని స్కాంకు సంబంధించిన సమాచారం తమ దగ్గర ఉందని.. త్వరలోనే చోక్సిని బహిష్కరిస్తామని తెలిపారు. చోక్సీ ద్వారా దేశానికి ఉపయోగంలేదనీ.. త్వరలోనే చోక్సి పౌరసత్వాన్ని ఉపసంహరించుకుంటామని స్పష్టం చేశారు. మంచి వ్యక్తిగా చోక్సిని భారత అధికారులు క్లియర్ చేయడం దురదృష్టకరమని అన్నారు ఆంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌.

పీఎన్‌బీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే డైమండ్‌ వ్యాపారులు నీరవ్‌ మోదీ, చోక్సీ విదేశాలకు పారిపోయారు. అయితే వీరి పాస్‌పోర్టులను రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. నిందితులను తిరిగి దేశానికి రప్పించేందుకు మల్లగుల్లాలు పడుతోంది. నీరవ్‌ ప్రస్తుతం లండన్‌ జైల్లో ఉండగా... అతని రిమాండ్‌ను అక్టోబర్ 17 వరకు పొడిగించింది లండన్‌ కోర్టు. తాను నిర్దోషినని.. తనపై వచ్చిన ఆరోపణలు తప్పుడివి అంటున్న చోక్సీ గతంలో ఒక వీడియోను పోస్ట్‌ చేశాడు. ఆ సమయంలో ఆంటిగ్వా ప్రభుత్వం చోక్సీని సమర్ధించింది కూడా. కానీ తాజాగా ఆంటిగ్వా ప్రధానే... చోక్సీని దొంగ అనడంతో చోక్సీకి ఇక అన్ని దారులు మూసుకుపోయినట్లే.

Next Story