'సైరా' స్టైలింగ్ డిజైనర్ 'ఉత్తర మీనన్'తో ఇంటర్వ్యూ..

1. మీరు ఇప్పటికే చాలా మంది హీరోలతో పని చేసారు.. కానీ సైరా అనేది పీరియాడికల్ సినిమా.. ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి ఎలా వచ్చింది..?
రాజీవన్ నంబియార్ నా కొలీగ్.. మేమిద్దరం కలిసి మనం సినిమాకు పని చేసాం.. అది బ్లాక్ బస్టర్ అయింది. అలాగే సరైనోడు సాంగ్స్ కోసం కూడా పని చేసాం. మేం ఎప్పుడూ ప్రొడక్షన్ డిజైన్ కలిసి చేయాలనుకున్నాం. తన దగ్గరికి ఈ సినిమా రాగానే.. నన్ను స్టైలింగ్ చేయమని అడిగాడు. నేను కూడా వెంటనే ఓకే చేసాను.
2. ఇది చిరంజీవి సినిమా కదా.. పైగా భారీ బడ్జెట్ సినిమా.. ఒత్తిడి ఫీల్ అవ్వలేదా.. ఎలా సైరా సినిమా కోసం సిద్ధమయ్యారు..?
నేను కష్టపడతాను.. చిన్నది పెద్దది అని కాదు.. సినిమా కోసం కష్టపడతాను. క్వాలిటీ ఆఫ్ వర్క్ నాకు ముఖ్యం. చిరంజీవి గారికి స్టైలింగ్ చేసి పెట్టడం గర్వంగా ఉంది.
3. ఈ సినిమా 1800 శతాబ్ధం నాటి కథ. సైరా నరసింహా రెడ్డి ఎలా ఉంటాడో కూడా తెలియదు. పైగా ఈ తరానికి అసలు అప్పటి క్యాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి.. స్టైలింగ్ ఎలా ఉంటుందనేది తెలియదు. మరి మీరు ఎలా దీనికోసం పని చేసారు.. ఎక్కడ్నుంచి రిఫరెన్స్ తీసుకున్నారు..?
అవును.. ఈ సినిమా మా దగ్గరికి వచ్చినపుడు మేం కూడా బ్లాంక్‌గానే ఉన్నాం. కానీ మా దగ్గర సత్తా కలిగిన కాస్ట్యూమ్ డిజైనర్స్, ఆర్ట్ డైరెక్టర్స్, కాన్సెప్ట్ ఆర్టిస్టులు ఉన్నారు. 7 నెలల పాటు చెన్నైలో ఉన్నాం.. ఇంటర్నెట్, బుక్స్ ఇలా ఎందులో ఏ చిన్న రిఫెరెన్స్ దొరికినా కూడా తీసుకున్నాం. ఇక నేను కూడా ఏ చిన్న క్లూ కూడా వదల్లేదు. 1800వ శతాబ్ధం సమయంలో ఉండే జ్యూవెలరీతో పాటు అన్నింటిని పరిశీలించాను. నెట్‌లో సర్చ్ చేసి నోట్స్ కూడా సిద్ధం చేసుకున్నాను. అనూష పుంజల ఆధ్వర్యంలో మేము సాలార్ జంగ్, ఛో మహల్ ఏ ప్యాలెస్, సెంట్రల్ స్టేట్ లైబ్రరీ లాంటి ప్లేసులు తిరిగాం. అక్కడ్నుంచి అన్ని వివరాలు సేకరించాం. అక్కడ్నుంచే ఫోటోగ్రాఫ్స్‌తో పాటు కొన్ని డ్రస్ స్టైల్స్ కూడా తీసుకున్నాం. ఇక నరసింహారెడ్డి గురించి నెట్‌లో కూడా కేవలం 4 ఫోటోలు మాత్రమే ఉన్నాయి. ఆయన పాలెగాడు అని తెలిసి.. ఆ ఐడియా ప్రకారం మేం కొన్ని కాస్ట్యూమ్స్ డిజైన్ చేసాం.
4. ఈ సినిమాలో ప్రతీ పాత్ర దేనికదే ప్రత్యేకం.. మీరు వీటి కోసం ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకున్నారు..?
అవును నిజమే.. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ప్రతీ కారెక్టర్‌కు వివరణ ఇచ్చేవాళ్లు (కాస్ట్యూమ్ స్టైలిస్ట్‌కు కూడా ఇది చాలా కీలకం). భిన్నమైన పాత్రలకు విభిన్నమైన లుక్స్‌తో ఆయా సన్నివేశాలకు తగ్గట్లుగా స్కెచ్‌లు గీసి ఇచ్చేవాళ్లం. గ్రామంలో కూడా ధనికుల నుంచి పేదల వరకు ఉంటారు. అందుకే అందరికీ ప్రత్యేకంగా స్కెచ్‌లు వేసాం. ఒక్కసారి స్కెచ్ ఓకే అయిపోయిన తర్వాత వాళ్ల కోసం ప్రత్యేకంగా డిజైన్స్ చేయడం మొదలుపెట్టాం. ఫ్యాబ్రిక్ వాడి ప్రత్యేకంగా స్టైలింగ్ చేసాం. అవన్నీ అద్భుతంగా వర్కవుట్ అయ్యాయి కూడా.
5. మీరు ఏ కారెక్టర్ కోసం ఎక్కువ పని చేసారు.. ఏది మీకు వర్క్ శాటిస్‌ఫ్యాక్షన్ ఇచ్చింది..?
నా వరకు అన్ని కారెక్టర్స్ నాకు నచ్చుతాయి. కానీ బ్రిటీషర్స్ కారెక్టర్స్ డిజైన్ చేయడానికి మాత్రం చాలా కష్టపడ్డాం.. అది మాకు ఛాలెంజ్ అనుకున్నాం. ముఖ్యంగా వాళ్లలో సీనియారిటీ నుంచి కారెక్టర్స్ విడదీయడానికి ప్రతీ ఒక్కరి కోసం ప్రత్యేకంగా స్కెచ్ గీయాల్సి వచ్చేది. వాళ్ల బెల్ట్, షూస్, బ్యాడ్జ్ దగ్గర్నుంచి అన్నీ చాలా జాగ్రత్తగా డిజైన్ చేసాం. ఆ తర్వాత స్టైలింగ్ కూడా అంతే అద్భుతంగా చేసాం కాబట్టి ఈ రోజు మీకు ఆ పాత్రలు ప్రాణం పోసుకున్నట్లు కనిపిస్తున్నాయి. మేం సింపుల్ స్కెచ్ వేస్తే అది సాధ్యం కాదు. కాబట్టి బ్రిటీషర్స్ డిజైనింగ్ మాకు ఛాలెంజ్.
6. నటీనటుల నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చింది..?
చాలా మంది నటులు కొత్త వాళ్లే.. అందుకే మాకు కూడా ఆసక్తికరంగా అనిపించింది. వాళ్లు కూడా తమ లుక్స్ విషయంలో కొత్తగా కనిపించాలని చాలా ఉత్సాహంగా కనిపించారు. కిచ్చా సుదీప్ వస్త్రాన్ని ఒక బొమ్మపై వేసుకుని.. దాని పక్కన గాలి కోసం ఫ్యాన్స్ ఉంచాము. ఎందుకంటే ఆ వస్త్రం ఎగరడానికి గాలి అవసరం.. అలా అతను ఆ గాలితో గుర్రంపై నుంచి సీన్‌లోకి ప్రవేశిస్తాడు. సినిమాలో అలాంటి సన్నివేశాలు చాలానే ఉంటాయి.
7. ప్రొడక్ట్ డిజైనర్ రాజీవన్‌తో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది.. ఆయన నుంచి మీకు వచ్చిన సపోర్ట్ ఏంటి..?
నా దృష్టిలో ఆయన బెస్ట్. ఈ రోజు వరకు కూడా ఆయన ఓ లుక్ కోసం ఇంటర్నెట్‌లో చూడటం నేను చూడలేదు. ఎలాంటి లుక్ అయినా కూడా ఆయన బుర్రలోంచి వస్తుంది. అంత జీనియస్ ఆయన. ఎంతటి కష్టమైన లుక్ అయినా కూడా ఇట్టే స్కెచ్ రూపంలో చేపించేస్తాడు. అతడితో కలిసి పని చేయడానికి నేను ఎప్పుడూ ఆసక్తిగా వేచి చూస్తాను. అతడి ఆర్ట్.. నా స్టైలింగ్ కలిపి స్క్రీన్‌పై విజువల్ అద్భుతంగా వస్తుందని నమ్ముతాను. ఇద్దరం కలిసి పని చేసి మంచి ఔట్ పుట్ ఇవ్వడానికి కృషి చేస్తాం. అప్పుడప్పుడు ఆయన శారీ బ్లౌజ్ ఐడియాలు కూడా ఇస్తుంటాడు. నేను కూడా ఆయన సెట్స్‌కు వెళ్లి చూస్తుంటాను. ఇద్దరం కలిసి వర్క్ చేయడంలో ఉన్న ఆనందం వేరు. సరైనోడు సినిమాలో బ్లాక్ బస్టర్ పాటను పూర్తిగా ఇద్దరం కలిసి డిజైన్ చేసాం. సెట్, స్టైలింగ్ కలిసే చేసాం. ఆయన లాంటి సపోర్టివ్ పర్సన్‌తో వర్క్ చేయడం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. నా తొలి సినిమాకు ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్నపుడు ముందుగానే ఆయన్ని ఏ కలర్ గార్మెంట్స్ తీసుకోవాలో అడిగేదాన్ని. ఈ రోజు వరకు కూడా మా ప్రొఫెషనల్ రిలేషన్ అంతే అందంగా ఉంది.
8. సైరా లాంటి కథలకు పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది కదా.. మీరు ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు..?
నాకు నా టీంకు ఇది కాస్త కష్టమైన పనే. రోజూ చాలా ప్రదేశాలకు తిరగాల్సి వచ్చేది. ఒక్కోరోజు హైదరాబాద్ అయితే మరో రోజు ఇంకోటి. పైగా నాకు ఓ బేబీ ఉంది. అలాంటప్పుడు నాకు ఇంకా కష్టం. తనకు నా అవసరం చాలా ఉంది. అయినా కూడా ఈ కష్టాన్ని నా క్రియేటివిటీతో ఓవర్ కమ్ చేసాను. ప్రతీ సన్నివేశానికి కలర్ ప్యాలెట్ క్రియేట్ చేయడం ఓ కలగా అనిపించేది నాకు. సినిమాలో మూడు యుద్ధాలు ఉంటాయి. వాటికి కూడా చాలా అందమైన డిజైనింగ్ చేసాం. మీరు సినిమా చూస్తే మా కష్టం అర్థమవుతుందనే అనుకుంటున్నాం. ప్రతీ సీన్‌కి ప్రాణం పెట్టి పని చేసాం.
9. దర్శకుడు సురేందర్ రెడ్డితో వర్కింగ్ గురించి చెప్పండి..?
తనకు ఏం కావాలో.. ఎలాంటి స్టైలింగ్ కావాలో.. ఎలాంటి కలర్స్, డిజైనింగ్ కావాలో పక్కాగా తెలిసిన దర్శకుడు సురేందర్ రెడ్డి. ఆయనతో వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. చిన్న కలర్ మార్చినా కూడా ఆయన ఒప్పుకోడు.. అదే సమయంలో అందరికీ కావాల్సినంత వర్క్ ఫ్రీడమ్ కూడా ఇస్తాడు. ఆయన మంచి టెక్నీషియన్.
10. నిర్మాతగా రామ్ చరణ్ పని తీరు ఎలా ఉంది.. ఆయన సైరా సెట్‌లో డిజైనింగ్ విషయంలో ఎంటర్ అయ్యేవాడా.. మీరు ఆయనతో నిర్మాతగా మాట్లాడటానికి కంఫర్ట్ ఫీల్ అవుతారా.. లేదంటే చిరంజీవి గారి కొడుకుగా మాట్లాడటానికా..? మీ ఇద్దరి మధ్య డిస్కషన్స్ జరిగాయా..?
అవసరం అనుకున్న ప్రతీసారి HOD లతో మీటింగ్ పెట్టి.. అందరి మనసులో ఉన్న ఐడియాలను కనుక్కునేవారు. అందరు చేసిన స్టైలింగ్ చూసి మెచ్చుకునేవారు. అలాగే ప్రతీ సెషన్‌లోనూ అందరితోనూ చరణ్ మాట్లాడేవాడు. నిర్మాతగానే ఆయనతో వర్క్ చేయడం కంఫర్ట్ అనిపించింది నాకు.
11. ఈ సినిమాకు పని చేసేటప్పుడు మీకు ఛాలెంజెస్.. కష్టాలు ఏమైనా ఎదురయ్యాయా..?
లేదు..
12. చిరంజీవి గారి నుంచి మీ వర్క్‌కు ఎలాంటి మెప్పు వచ్చింది..?
నా వర్క్స్ స్క్రీన్ మీద చూసుకోవడం ఎప్పుడూ ఆనందంగానే ఉంటుంది. చిరంజీవి గారు కూడా మా ఆఫీస్‌కు వచ్చారు. అలాగే నా స్కెచెస్ చూసి ఉత్తర.. నువ్వు నన్ను నిజంగానే మహారాజాలా ఫీల్ అయ్యేలా చేసావు అన్నారు. నా వర్క్ గుర్తించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అందరి ముందు నన్ను మెచ్చుకున్నందుకు చిరంజీవి గారికి ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఒక స్టైలిస్ట్ సినిమా రూపాన్ని మరియు టోన్ మొత్తం తన లుక్, సెట్స్‌తో మార్చేస్తాడు. కాస్ట్యూమ్ డిజైనర్లు ఆ రూపానికి జీవం తీసుకొస్తారు. కాస్ట్యూమ్ డిజైనర్లు మరింత సృజనాత్మకంగా ఉన్నపుడే ఇవన్నీ సాధ్యమవుతాయి. ఇది తేలికైన పనికాదు. దీనికోసం చాలా క్రియేటివ్ ఫ్రీడమ్ కావాలి. అన్నీ దొరికాయి కాబట్టే సైరాలో మా వర్క్ ఇంత అద్భుతంగా వచ్చింది.
13. సైరా చిత్రం మీకు ఎంత ప్రత్యేకంగా నిలబడబోతుంది..?
ఇది నా ఫస్ట్ పీరియాడిక్ ఫిల్మ్.. ఇంత పెద్ద సినిమాకు లుక్స్ క్రియేట్ చేయడం.. ఇంత పెద్ద టీంతో పని చేయడం.. ఇవన్నీ నాకు ప్రత్యేకంగానే నిలిచాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com