'పది' పబ్లిక్ పేపర్ మారింది.. ఇకపై ఈ విధంగా.. ఒకసారి చూసుకోండి..

పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులు గమనించుకోవలసిన ఓ ముఖ్య అంశం. ప్రశ్నాపత్రం స్వరూపం మారింది. ఇక నుంచి బిట్ పేపర్ ప్రశ్నాపత్రంతోనే అనుసంధానమై ఉంటుంది. అంతే కాకుండా ఇంటర్నల్ మార్కులు కూడా రద్దవుతున్నాయి. పరీక్షా సమయం కూడా మారింది. ఇంతకు ముందు 2:30 నిమిషాలు ఉండేది. ఇప్పుడు దాన్ని మరో 15 నిమిషాలకు పెంచారు. ప్రశ్నాపత్రం చదువుకోవడానికి 10 నిమిషాలు.. రాయడానికి 2:30 గంటలు.. రాసినవి చెక్ చేసుకోవడానికి 5 నిమిషాలు.. ఇలా మొత్తం కలిపి 2:45నిమిషాలు కేటాయించారు. ప్రశ్నాపత్రం మొత్తాన్ని నాలుగు విభాగాలుగా రూపొందించారు.
ఇందులో 5 వ్యాసరూప ప్రశ్నలుంటే వాటికి ఒక్కోదానికి 4 మార్కుల చొప్పున 20 మార్కులు ఉంటాయి. 8 లఘు ప్రశ్నలకు 2 మార్కుల చొప్పున 16 మార్కులు ఉంటాయి. 8 సూక్ష్మ లఘు ప్రశ్నలకు 1 మార్కు చొప్పున 8 మార్కులు ఉంటాయి. 12 ఉన్న మరీ చిన్న ప్రశ్నలకు అర మార్కు చొప్పున 6 మార్కులు ఉంటాయి. బిట్ పేపర్ అనేది ప్రత్యేకంగా ఇకపై ఉండదు. ప్రశ్నపత్రంలోనే అన్నీ కలిపి వచ్చేస్తున్నాయి. జవాబు పత్రాలను కూడా విడివిడిగా అడిషనల్స్ పేరుతో కొన్ని వైట్ పేపర్లు ఇవ్వకుండా 18 పేజీలతో కూడిన బుక్‌లెట్ ఇస్తారు.
విద్యార్థులందరికీ ప్రశ్నపత్రంపై పరీక్షల ముందే అవగాహన కల్పిస్తారని ఏపీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ గురువారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ వివరించారు. మార్కుల జాబితా తడిచినా చిరిగిపోకుండా ఉండేందుకు నాణ్యమైన పేపర్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. 20 శాతం ఇంటర్నల్ మార్కుల వల్ల కార్పొరేట్ స్కూళ్లకే లబ్ది చేకూరుతుందని అందుకే ఆ విధానానికి స్వస్తి చెప్పామన్నారు. ఇక బిట్ పేపర్ గురించి మాట్లాడుతూ మాస్ కాపీయింగ్ అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ కీలక మార్పులన్నీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే అమల్లోకి తీసుకువస్తున్నట్లు మంత్రి వివరించారు. ప్రతి సబ్జెక్టులో పేపర్-1, 50 మార్కులకు, పేపర్-2, 50 మార్కులకు ఉంటుందన్నారు. రెండు పేపర్‌లను కలిపి పాస్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com