హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి..

హైదరాబాద్ లో ఫ్లాట్ కొనాలనుకుంటున్నారా..? అయితే ఇది చదవండి..
X

ఒకప్పుడు ఇల్లంటే గజాలలో లెక్కలు వేసేవారు. గజం ఇంతా అంతా అని. కానీ ఇప్పుడు అంతా ఫ్లాట్ల మయం. అందుకే స్క్వేర్ ఫీట్లలో లెక్కలు వేస్తున్నారు. ఎక్కడ చూసినా జనం. పెరిగి పోయిన భాగ్యనగర వాసుల అవసరం దృష్ట్యా అన్ని హంగులతో అపార్ట‌మెంట్లు నిర్మిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో విల్లాలు, హైటెక్ హార్మ్యాలు వెలసినా.. మరి కొన్ని ప్రాంతాల్లో సామాన్యులకు అందుబాటులో ఉంటున్నాయి అపార్టు మెంట్లు. ఇక పండుగ సీజన్‌ని పురస్కరించుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొనుగోలు దారులను ఆకర్షించే నిమిత్తం ఆపర్లు ప్రకటిస్తున్నాయి. ఫ్లాట్ల కొనుగోళ్లు ఎక్కువగా ఉండొచ్చని ఆశిస్తున్నారు. మంచి రోజులు ఉండడంతో సిటీలోని పలు ప్రాంతాల్లో కొత్త వెంచర్లు మొదలవుతున్నాయి. మున్ముందు హైదరాబాద్ మరింతగా విస్తరించే అవకాశం ఉండడంతో స్థిరాస్థి లావాదేవీలు ఊపందుకుంటున్నాయి. సిటీ నలువైపులా నిర్మాణాలు జరుగుతున్నాయి. సామన్య, మధ్యతరగతి వాసులను దృష్టిలో పెట్టుకునే చేసే వెంచర్లే ఎక్కువ వుంటున్నాయి. గేటెడ్ కమ్యూనిటీల్లాంటివైతే అప్పర్ మిడిల్ క్లాస్ వారిని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు.

అయితే ప్రాజెక్టు మొదలు పెట్టినప్పుడు తీసుకునే వారు తక్కువగా ఉంటున్నట్లు తేలింది. కారణం ఉంటున్న ఇంటికి అద్దె చెల్లించాలి. తీసుకున్న కొత్త ఇంటికి లోన్ కట్టాలి. రెండూ అంటే మధ్యతరగతి వాసికి భారం. కానీ మొదట్లో తీసుకుంటేనే తక్కువగా ఉంటుందని దాదాపు 80 శాతం పూర్తయితే రేటు కొద్దిగా ఎక్కువే వుంటుందని చెబుతున్నారు బిల్డర్లు. మెట్రో రాకతో కాస్త సిటీకి దూరంగా ఉండడానికి కూడా ఇష్టపడుతున్నారు నగర వాసులు. అల్వాల్, బోయినపల్లి, కొంపల్లి, సాకేత్ , మల్కాజ్‌గిరి ప్రాంతాల్లో ఫ్లాట్స్ చ.అడుగు రూ.2800 నుంచి రూ.4000 వరకు చెబుతున్నారు. మెహదీపట్నం, కవాడిగూడ, పద్మారావు నగర్ ప్రాంతాల్లో అయితే రూ.4500తో ప్రారంభమవుతోంది. టూ బెడ్ రూం ఫ్లాట్ కొనాలంటే ఇక్కడ రూ.65 లక్షల నుంచి కోటి వరకు ఖర్చవుతోంది. పాతవైతే రూ.50లక్షలకు దొరుకుతున్నాయి.

బంజారాహిల్స్ జుబ్లీహిల్స్ వంటి ఏరియాల్లో అయితే చ.అడుగు 7వేల పైమాటే. అత్తాపూర్, హైదర్‌గూడ, బండ్లగూడ, అప్పా జంక్షన్ ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతోంద. అక్కడ చ.అడుగు రూ.3300 నుంచి రూ.4500 వరకు చెబుతున్నారు. ఉప్పల్,ఎల్‌బీనగర్, నాగోల్, బండ్లగూడ, హస్తినాపురం వరకు అపార్ట్‌మెంట్ల నిర్మాణాలు పెరిగాయి. ఇక్కడ చ.అడుగు రూ.3000 నుంచి రూ.4600 వరకు ఉంది. అభివృద్ది చెంది అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటే రేటు ఎక్కువగానే ఉంటుంది. అదే కొంచెం లోపలికి వెళితే రేటు తక్కువగానే ఉంటుంది. ఇక ఐటీ కారిడార్‌గా మంచి డిమాండ్ ఉన్న ఏరియాలు కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, నార్సింగి, నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, మణికొండ, తెల్లాపూర్, లింగంపల్లి ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అపార్ట్‌మెంట్లు వెలుస్తున్నాయి. ఇక్కడ చ.అడుగు రూ.4 వేల పైనే చెబుతున్నారు. ఇక్కడే కొన్ని ప్రాజెక్టుల్లో అయితే రూ.6వేల వరకు ధర పలుకుతోంది చ.అడుగు. బాచుపల్లి, చందానగర్, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ, నిజాంపేట, ప్రగతినగర్ వంటి ఏరియాల్లో చ.అడుగు రూ.3500 నుంచి రూ.6000 వరకు ఉంటోంది.

Tags

Next Story