ఈఎస్ఐ మెడికల్ స్కామ్.. అన్ని వందల కోట్లా.!

ఈఎస్ఐ మెడికల్ స్కామ్.. అన్ని వందల కోట్లా.!

ఈఎస్ఐ మెడికల్ స్కాంలో ఆడియో టేపులు బయటికి రావడంతో అక్రమాలు ఒక్కొకటిగా బయటపడుతున్నాయి... తప్పుడు బిల్లులు పెట్టాలంటూ డైరెక్టర్, అడిషనల్ డైరెక్టర్ ఆదేశాలతో సెక్షన్ ఆఫీసర్ సురేంద్రనాథ్ వైద్యులపై ఒత్తిడి తెచ్చినట్టు తేలింది.

50 లక్షల రూపాయలకు తప్పుడు బిల్లులు తయారుచేసి పంపించాలంటూ డాక్టర్ పై ఒత్తిడి తెచ్చిన ఆడియోలు ఇప్పుడు ఏసీబీ చేతికి చిక్కాయి. క్యాంప్‌లు పెట్టకుండానే.. పెట్టినట్టు సృష్టించి.. మెడికల్‌ క్యాంప్‌ల పేరుతో మెడిసిన్ పంపించినట్లు రికార్డు సృష్టించాలని ఈఎస్ఐ డాక్టర్ పై ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా మోసం చేయడానికి ఓ డాక్టర్, మరో మహిళా అధికారి ఒప్పుకోక పోవడంతో బెదిరింపులకు పాల్పడ్డారు సెక్షన్‌ ఆఫీసర్‌..

23 చోట్ల సోదాలు చేసి అధికారుల ఇళ్ళలో, కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్న పత్రాలు, డాక్యుమెంట్లు, ఆర్డర్ కాపీలు, బిల్స్, రికార్డులను పరిశీలిస్తున్నారు అధికారులు. మొత్తం 200 కోట్ల వరకు అవినీతి జరిగినట్లు అధికారులు ఓ అంచనాకి వచ్చారు. ఈ కేసులో ఈఎస్ఐ అధికారులతో పాటు ఓ ఐఏఎస్ అధికారి ప్రమేయంపై అధికారులు దృష్టి పెట్టారు. డైరెక్టర్ దేవికారాణి, పద్మ, వసంతల కాల్ డేటా,బ్యాంక్ ఎకౌంట్లను అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే కొన్ని సీసీ ఫుటేజ్‌లు స్వాధీనం చేసుకొని పరిశిలిస్తున్నారు. ఇక డిస్పెన్సరీ నుంచి డిమాండ్ లేకపోయినా మందుల కొనుగోళ్లు చేసినట్లు విచారణలో తేలింది. మందులను థర్డ్ పార్టీ నుంచి కొనుగోలు చేసి, నకిలీ బిల్లులు సృష్టించినట్లు పక్కా ఆధారాలు సేకరించారు. దీంతో మెడికల్ ఏజెన్సీల నిర్వాహకుల ప్రమేయం పైనా అధికారులు దృష్టి పెట్టారు.

డిస్పెన్సరీలకు మందులు సరఫరా చేసినట్లుగా దొంగ లెక్కలు సృష్టించి, బొల్లారం, బాచుపల్లి డిస్పెన్సరీ, శంషాబాద్ అధికారుల పేర్లతో బిల్లులు పెట్టి క్లైమ్ చేసుకున్నారు. ఓమ్నీ, మెడిఫార్మా, తేజా ఫార్మాతో పాటు మరో 4 కంపెనీల నుంచి నకిలీ బిల్లులు సృష్టించినట్టు ఆధారాలు సేకరించారు. కలర్ జిరాక్స్ ఇండెంట్స్ తోనే భారీ కుంబకోణానికి తెరలేపారు. ఐదు ఇండెంట్లను పరిశీలించగా, కేవలం ఐదు ఇండెంట్లలోనే పది కోట్ల వరకు మోసం చేసినట్లు గుర్తించారు అధికారులు. కేసు పూర్తి అవ్వడానికి దాదాపు ఏడాది కాలం పడుతుందంటున్నారు ఏసీబీ అధికారులు.

రిమాండ్‌లో ఉన్న ఏడుగురు నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం కస్టడీ పిటిషన్‌పై ఏసీబీ కోర్టులో విచారణ జరగునుంది. పది రోజులు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు కోరారు. విచారణ తరువాత ఎన్ని రోజులు కస్టడీ అనుమతిస్తుంది అనేది సోమవారం విచారణలో తెలనుంది.

Tags

Next Story