డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ల పాత్ర.. అసలేంటీ ప్లేట్‌లెట్ల గొడవ..

డెంగ్యూ జ్వరంలో ప్లేట్‌లెట్ల పాత్ర.. అసలేంటీ ప్లేట్‌లెట్ల గొడవ..

జలుబు, దగ్గు వచ్చి కొంచెం ఒళ్లు వేడెక్కితే చాలు భయపడుతున్నారు. డాక్టర్ దగ్గరకు వెళితే అది ఎక్కడ డెంగ్యూ ఫీవర్ అంటారోనని. నిజానికి జ్వరాలన్నీ డెంగ్యూ కాదు. అంత భయపడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం మొత్తుకుంటున్నా ఎవరి భయం వారిది. ఇక డెంగ్యూ పేరుతో ట్రీట్‌మెంట్ తీసుకుంటే బిల్లు వాచి పోతుంది. ప్లేట్‌లెట్లు పడిపోయాయి. ఉండవలసిన వాటికంటే తక్కువ వున్నాయని హాస్పిటల్‌లో బెడ్ కన్ఫామ్ చేసేస్తారు. చేసేది ఏమీ లేక డాక్టర్లు చెప్పినట్లు చేయడమే పని.

మరి ట్రీట్‌మెంట్‌లో భాగంగా వారు ప్లేట్‌లెట్లు ఎక్కిస్తారా లేక ప్లేట్‌లెట్లు పెరగడానికి మందులు ఇస్తారా. అసలు ఇంతకీ ప్లేట్‌లెట్లు అంటే ఏమిటి.. రక్తం ఎక్కించడం తెలుసు.. రక్తదానమూ తెలుసు.. ప్లేట్‌లెట్లు కూడా విడిగా దానం చేస్తారా.. ఇలా ఎన్నో ప్రశ్నలు.. ప్లెట్‌లెట్లు దొరక్క చాలా మంది పేషెంట్లు ప్రాణాపాయానికి గురవుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంతటి ప్రాముఖ్యత ఉన్న ప్లేట్‌లెట్ల గురించి తెలుసుకుందాం..

డెంగ్యూ దాడితో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ప్లేట్‌లెట్లకు డిమాండ్ పెరిగింది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక చాలా మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్లేట్‌లెట్ల పట్ల సరైన అవగాహన లేక దానం చేయడంలో వెనుకడుగు వేస్తున్నారు. వాస్తవానికి ప్లేట్‌లెట్లు, రక్తదానం ఒకటి కాదు. తెల్లరక్త కణాలు, ఎర్రరక్త కణాలు, ప్లాస్మా, ప్లేట్‌లెట్లు రక్తంలో ఒక భాగం. ప్లేట్‌లెట్స్ ఎముక మజ్జలో తయారైన మూల కణ శకలాలు. దెబ్బతిన్న రక్త నాళాలను మరమ్మతు చేయడానికి మరియు రక్తస్రావాన్ని ఆపడానికి ఈ కణాలు అడ్డుకట్ట వేస్తాయి.

ప్లేట్‌లెట్స్ శరీరంలో సుమారు 10 రోజులు మాత్రమే నివసిస్తాయి కాబట్టి, ఎముక మజ్జ రోజూ మిలియన్ల ప్లేట్‌లెట్లను సృష్టిస్తుంది. ప్లాస్మా రక్తం గడ్డకట్టేటట్లు చేస్తుంది. ఇక తెల్ల, ఎర్ర రక్త కణాలు వ్యాధి కారక క్రిములపై పోరాటం చేసి రోగాలు రాకుండా చూస్తాయి. డెంగ్యూ జ్వరం కారణంగా రక్తంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోతాయి. ఒక క్యూబిక్ ఎంఎం రక్తంలో 1.5 నుంచి 4 లక్షల వరకు ప్లేట్‌లెట్లు ఉంటాయి. ఇవి పది వేల కంటే తగ్గితే రోగి తీవ్ర రక్త స్రావానికి గురవుతాడు. తర్వాత రోగి షాక్‌లోకి వెళ్లిపోతాడు. కాలేయం ఇతర అవయవాలు వైఫల్యం చెంది మృత్యవాత పడతాడు. అందుకే పదివేల కంటే తగ్గితే తక్షణం బయట నుంచి ఎక్కించాల్సి ఉంటుంది.

ఆరోగ్యంగా ఉన్న స్త్రీ, పురుషులు 3నెలలకి ఒకసారి రక్తదానం చేయవచ్చని ప్రముఖ వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కావని వారంటున్నారు. ఒకే గ్రూపు ఉన్న వారి మధ్య రక్త మార్పిడి జరిగితే ఇక్కడ దాత నుంచి కేవలం ప్లేట్‌లెట్లను మాత్రమే తీసుకుంటారు. అదే వేర్వేరు గ్రూపులున్న వారి మధ్య రక్త మార్పిడి జరిగితే దాత నుంచి ముందుగా రక్తం సేకరిస్తారు. దాన్నుంచి ప్లేట్‌లెట్లను వేరు చేసి గ్రహీతకు ఎక్కిస్తారు.

అనారోగ్య సమస్యలున్నవారు అంటే క్యాన్సర్, హెపటైటిస్, ఎయిడ్స్, టీబీ ఇతర సుఖ వ్యాధులు ఉన్నవారు, మతిస్థిమితం లేని వారు, మానసిక సమస్యలతో బాధపడుతున్నవారు, టాటూలు వేయించుకున్నవారు, డెంటల్ శస్త్ర చికిత్సలు చేయించుకున్నవారైతే సంవత్సరంపాటు రక్తదానం చేయకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు, మద్యం సేవిస్తే 24 గంటలలోపు, సిగరెట్ తాగితే 2 గంటల వరకు రక్తదానానికి దూరంగా ఉండాలి.

రక్తదానం కానీ, ప్లేట్‌లెట్లు దానం కానీ చేస్తే ఉండే ఉపయోగాలు.. ఇవి దానం చేస్తే రక్తంలో ట్రైగ్లిజరాయిడ్స్ తగ్గి కొవ్వు శాతం నియంత్రణలో ఉంటుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఇక ఒకసారి రక్తదానం చేస్తే ఆ రక్తంతో ముగ్గురి ప్రాణాలు కాపాడొచ్చు. రక్తం, ప్లేట్‌లెట్లు, కణాలు వేరు చేసి ఆయా వ్యక్తులకు అందించడానికి వీలుంటుంది. తరచూ రక్తదానం చేయడం వల్ల రక్త క్యాన్సర్ ముప్పు నుంచి తప్పించుకోవచ్చు. కనీసం ఏడాదికి ఒకసారి రక్త దానం చేస్తే 88 శాతం గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని డాక్టర్లు వివరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story