ఈఎస్‌ఐ స్కామ్.. వెయ్యి కోట్ల రూపాయిల..

ఈఎస్‌ఐ స్కామ్.. వెయ్యి కోట్ల రూపాయిల..
X

ఈఎస్‌ఐ స్కాంలో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈఎస్‌ఐ డైరెక్టర్‌ దేవికారాణి అరెస్ట్‌తో ఈ స్కాం వెనుక ఉన్న పాత్రాధారులు ఒక్కొక్కరుగా తెరమీదకు వస్తున్నారు. ఈఎస్‌ఐ విభాగంలోని సిబ్బంది, అధికారులతో పాటు ప్రైవేట్‌ వ్యక్తులు కుమ్మక్కై భారీగా దోచుకున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. గడిచిన నాలుగేళ్లలో ఏడాది 250 కోట్ల రూపాయిల చొప్పున... నాలుగేళ్లలో దాదాపు వెయ్యి కోట్ల రూపాయిల మెడిసిన్‌ కొనుగోళ్లు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఈ స్కాంకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 70 డిస్పెన్సరీల వివరాలు సేకరించిన అధికారులు.. కుంభకోణం పాత్రధారులను శరవేగంగా గుర్తిస్తోంది.

విచారణలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పలు మెడికల్‌ ఏజెన్సీ కార్యాలయాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బుధవారం ఓమ్ని మేడి ఉద్యోగి నాగరాజు ఇంట్లో 46 కోట్ల విలువైన నకిలీ ఇండెంట్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి పలువురు ఈఎస్‌ఐ ఉద్యోగుల సంతకాలను సైతం సేకరించారు. ఇప్పటికే దేవికారాణితో పాటు ఏడుగురిని అరెస్ట్‌ చేసిన అధికారులు... మరో రెండు రోజుల్లో స్కాంకు సంబంధం ఉన్న మరికొంత మందిని అరెస్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ కుంభకోణంలో డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌ తర్వాత శివనాగరాజే కీలక నిందితుడిగా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. డైరెక్టర్‌, జాయింట్‌ డైరెక్టర్‌కు మధ్యవర్తిగా ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దే బాధ్యతను శివనాగరాజు స్వీకరించినట్లు తెలుస్తోంది. అతన్ని విచారిస్తే ఇండెంట్లు, పర్చేజ్‌ ఆర్డర్‌ల సమాధానం రాబట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Tags

Next Story