మోదీతో కేసీఆర్ కీలక సమావేశం.. గోదావరి-కృష్ణా అనుసంధానం..

మోదీతో కేసీఆర్ కీలక సమావేశం.. గోదావరి-కృష్ణా అనుసంధానం..
X

ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో... గోదావరి- కృష్ణా నదుల అనుసంధానంపై మోదీతో చర్చిస్తున్నారు సీఎం కేసీఆర్‌. శ్రీశైలానికి గోదావరి జలాల తరలింపుపై ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్‌ ఇప్పటికే రెండుసార్లు చర్చించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు రెండు రాష్ట్రాలకు ఎంతో మేలు చేస్తుందని.. దీనికి కేంద్ర ఆర్థిక సహకారం అవసరమని ప్రధానిని కేసీఆర్‌ కోరనున్నారు. ప్రస్తుతం పార్లమెంటు పరిశీలనలో ఉన్న డ్యామ్‌ సేఫ్టీ బిల్లు, నదీ జలాల యాజమాన్య బిల్లు వచ్చే నెలలో ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఆమోదం పొందితే... నదీజలాలతో పాటు దేశంలోని ఆనకట్టలన్నీ కేంద్రం పరిధిలోకి వస్తాయి. కేంద్రం అనుమతి లేకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలోనే మోదీ సహకారం కోరుతున్నారు సీఎం కేసీఆర్‌.

మరోవైపు .. కాళేశ్వరం ఎత్తిపోతల, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా కల్పించాలని కోరనున్నారు. ఇతర ప్రాజెక్టులకు వివిధ కేంద్ర పథకాల నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరే అవకాశం ఉంది. దేశంలోని ఇంటింటికీ మంచినీటి సదుపాయం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం జలశక్తి అభియాన్‌ ప్రాజెక్టును చేపట్టింది. ఇటు రాష్ట్రంలో ఇప్పటికే మిషన్‌ భగీరథ ప్రాజెక్టు ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో మిషన్‌ భగీరథకు జలశక్తి అభియాన్‌ కింద నిధులు కేటాయించాలని సీఎం కేసీఆర్‌ ప్రధానిని కోరనున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణకు సంబంధించి పెండింగ్‌ అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Tags

Next Story