భక్తజనసంద్రంగా మారిన తిరుమల

భక్తజనసంద్రంగా మారిన తిరుమల

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి... శ్రీవారి వాహనసేవలలో ప్రధానమైన గరుడ వాహన సేవను చూసి తరించేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.. దీంతో ఏడుకొండలు భక్తజనసంద్రంగా మారిపోయాయి. రాత్రి 7 గంటల నుంచి 12 గంటల వరకు గరుడవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.. ఈ అద్భుతమైన ఘట్టాన్ని చూసి తరించేందుకు ఉదయం నుంచే భక్తులకు గ్యాలరీలకు చేరుకుంటున్నారు. దీంతో ఇప్పటికే ఆలయ మాడవీధులన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గ్యాలరీల్లో ఉన్నవారికి ఎలాంటి అసౌకర్యం కలుగకుండా వాటర్ బాటిళ్లు... మజ్జిగ ప్యాకెట్లు, అన్నప్రసాదాలను అందిస్తున్నారు. మాడ వీధుల్లో 20 చోట్ల, బయట మరో 14 చోట్ల LED తెరలను ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు..

శ్రీవారికి జరిగే వాహన సేవల్లో అత్యంత కీలకమైంది గరుడ సేవ. శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల సమయంలో ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికేది గరుత్మంతుడే. దాసుడిగా, మిత్రుడిగా, విసనకర్రగా, ఆసనంగా, ఆవాసంగా, ధ్వజంగా అనేక విధాలుగా గరుత్మంతుడు శ్రీనివాసుడిని సేవిస్తున్నాడు. గరుడ వాహనంపై విహరించే స్వామివారిని మకరకంఠి, సహస్రనామ మాల, లక్ష్మీహారాలతో అలంకరిస్తారు. ఈ గరుడోత్సవంలో స్వామి ఒక్కరే పాల్గొంటారు. సమస్త వాహనాలలో సర్వశ్రేష్ఠమైన గరుడవాహనంపై ఉన్న స్వామిని దర్శిస్తే, స్వర్గం ప్రాప్తించి, ఇహపరమైన ఈతి బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది. ప్రసన్న వదనుడిగా గరుత్మంతుడిపై ఊరేగే శ్రీనివాసుని దర్శించడం వల్ల సకల సౌభాగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే బ్రహ్మోత్సవాల్లో గరుడ సేవ విశిష్టత సంతరించుకుంది.

Tags

Next Story