జుట్టు రాలడాన్ని నివారించే ఆనియన్ ఆయిల్..

మారుతున్న జీవన అలవాట్లు.. పెరిగిపోతున్న పొల్యూషన్ కారణంగా ప్రతి ఒక్కరు ఎదుర్కుంటున్న సమస్య జుట్టు రాలడం. సరైన పోషణ అందకపోయినా జుట్టు రాలిపోతుంది. వారానికి రెండు సార్లు తలస్నానం, ప్రొటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం, సరైన నిద్ర ఇవన్నీ జుట్టు ఆరోగ్యంగా ఎదగడానికి దోహదం చేస్తాయి. జట్టు రాలడానికి అత్యంత ప్రభావవంతమైన ఇంటి నివారణలలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయను నూనెతో కలిపి రాసుకుంటే జుట్టు ఊడడాన్ని చాలా వరకు అరికట్టవచ్చు. ఉల్లిపాయలో ఉన్న కొన్ని గుణాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది. దీనిలో కొన్ని ఖనిజాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మంచివి. ఇందులో ఉన్న సల్ఫర్ జుట్టు తగిన పోషణను అందించి పెరుగుదలకు సహాయపడుతుంది.
ఉల్లిపాయలో యాంటీ-బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది జుట్టు కుదుళ్లు పెరగడానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ నూనె వాడటం వల్ల మీ చర్మం యొక్క పిహెచ్ కూడా సమతుల్యం అవుతుంది మరియు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. నెత్తిమీద మెరుగైన రక్త ప్రసరణ జుట్టు పెరుగుదలను పెంచుతుంది. వెంట్రుకలు బలహీనంగా లేకుండా ఆరోగ్యంగా ఉంటాయి. ఉల్లిపాయ నూనె తయారీని ఇంట్లోనే చేసుకోవచ్చు. 100గ్రాముల కొబ్బరి నూనెకు ఒక ఉల్లిపాయను ముక్కలుగా తరిగి తీసుకోవాలి. దాంతో పాటు గుప్పెడు కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ఈ మూడింటిని కలిపి స్టౌ మీద చిన్న మంటపై ఉంచాలి. కరివేపాకు నల్లగా మారిపోయిన తరువాత దించి వడకట్టాలి.
గోరు వెచ్చగా ఉన్నప్పుడు జుట్టు కుదుళ్లకు పట్టించి వేళ్లతో మసాజ్ చేయాలి. పావుగంట ఉంచుకున్నాక గోరు వెచ్చని నీళ్లతో జుట్టుని కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. లేదా రాత్రి పూట రాసుకుని ఉదయాన్నే కడిగేసినా మంచిదే. ఇది పూర్తిగా సహజమైనది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఉల్లిపాయ అంటే అలర్జీ ఉన్న వారు వాడకపోవడమే మంచిది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com