త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడు..

తిరుమల బ్రహ్మోత్సవాల్లో హనుమంత వాహనసేవ నయనానందకరంగా సాగింది. తిరుమలేశుడు హనుమంత వాహనంపై ఊరేగారు. దాస భక్తిని చాటుకునే హనుమంతుడు శ్రీరామునికి సేవలందించిన తీరును ప్రస్ఫుటించేలా ఈ సేవ మహదానందంగా సాగింది. శ్రీవారిని అర్చించుకునే వివిధ భక్తిమార్గాలను భక్తులకు ఉపదేశిస్తున్నట్లుగా వాహనసేవ కొనసాగింది.
త్రేతాయుగం నాటి శ్రీరామచంద్రుడిని కూడా తానేనని చెబుతూ వెంకటాద్రి రాముడిగా శ్రీనివాసుడు కనువిందు చేశారు. ప్రతిరోజు రాముడి పేరిట సుప్రభాత సేవలో మేల్కొంటున్న వెంకటేశ్వరుడు లోకహితం కోసం రామునిగా కృష్ణునిగా అవతరించినట్టు తెలియజేయడమే ఈ వాహనసేవలోని అంతరార్ధం. హనుమంతుడు దాస్యభక్తికి ప్రతీక.హనుమంతుని వలె దాసులై భక్తితో తనను సేవించి అభిష్టసిద్ది పొంది తరించండంటూ ఈ వాహనసేవ ద్వారా స్వామివారు సందేశమిచ్చారు. భగవంతుడి కంటే భగవన్నామ స్మరణే గొప్పదని చాటిచెప్పినవాడు హనుమంతుడు. శ్రీ మహావిష్ణువుకి వాహనం గరుత్మంతుడైతే, సేవకుడు హనుమంతుడు. త్రేతాయుగ రాముడిని మాత్రమే సేవించి తరించిన హనుమంతుడు సమస్త భక్తకోటికి అదర్శప్రాయుడు. కాబట్టి హనుమంత వాహనాన్ని దర్శించిన భక్తులందరు తన దాసులుగా మారాలన్నదే ఈ వాహనసేవలోని పరమార్థం. హనుమంత వాహనంపై స్వామివారి వైభవాన్ని తిలకించి భక్తులు తన్మయత్వం పొందారు.
అనంతరం సాయంత్రం వేళ స్వర్ణరథంపై శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కలిసి తిరుమాడ వీధుల్లో విహరించారు.. కోలాటాలు, నృత్య ప్రదర్శనలు, కళారూపాల నడుమ స్వర్ణరథంపై శ్రీనివాసుడు భక్తులకు అభయప్రదానం చేశారు..
రాత్రివేళ స్వామివారు గజ వాహనం మీద తిరువీధులలో ఊరేగి భక్తులను మురిపిస్తున్నారు. ఉభయ దేవేరుల సమేతుడై... ఏనుగు అంబారీ ఎక్కిన దేవదేవుణ్ని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. వేల సంఖ్యలో తరలివచ్చిన భక్త జనానికి... అభయప్రదానం చేస్తూ... తిరుమాడ వీధుల్లో విహరించారు వెంకటేశ్వరస్వామి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com