ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ మంజూరు
X

ఎంపీడీవో సరళ ఇంటిపై దౌర్జన్యం కేసులో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి బెయిల్ వచ్చింది. తెల్లవారుజామున ఆయన్ను చేసిన పోలీసులు.. మొబైల్ అండ్ స్పెషల్ జ్యుడీషియల్ కోర్టులో హాజరుపరిచారు. దీనిపై విచారణ తర్వాత బెయిల్ మంజూరైంది. అటు.. కోటంరెడ్డి అరెస్టు నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. మేజిస్ట్రేట్ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరుడు బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిపై 290, 506, 448, 427 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ఏ1గా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఏ2గా బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని పేర్కొన్నారు. ప్రస్తుతం ఇద్దరికీ బెయిల్ రావడంతో.. కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఓ ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి, ఆమె ఇంటిపై దౌర్జన్యం చేసిన కేసులో పోలీసులు పెట్టిన సెక్షన్లపై విమర్శలు వస్తున్నాయి. కావాలనే నామమాత్రపు కేసులతో సరిపెట్టారని అంటున్నారు. ముఖ్యమంత్రి ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ప్రచారం చేసుకుంటూనే.. ఏదో మొక్కుబడి కేసులు పెట్టడం ఏంటని విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ముందుగా వీరిద్దరిపై పెట్టిన కేసుల్ని చూస్తే.. 290 సెక్షన్ అంటే అది పబ్లిక్ న్యూసెన్స్ కేసు. దీనికి బెయిల్ వస్తుంది. కోర్టు విధించే శిక్ష కూడా 200 రూపాయలు మాత్రమే. అలాగే 448 సెక్షన్ అంటే అనుమతి లేకుండా ఒకరి ఇంట్లోకి ప్రవేశించడం. దీనికి 1000 రూపాయల ఫైన్‌తో సరిపోతుంది. ఇక దురుసుగా ప్రవర్తించినందుకు, బెదిరించినందుకు 427, 506 సెక్షన్ల కింద కేసు పెట్టారు. వీటికి జరిమానాతో పాటు 2 ఏళ్ల వరకూ జైలు పడొచ్చు. ఇలాంటి సెక్షన్ల కింద కేసులు పెట్టి మొక్కుబడిగా పోలీసులు వ్యవహరించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిపై దౌర్జన్యం చేస్తే నిబంధనల ప్రారం IPC సెక్షన్ 353, 354 కింద కేసు పెట్టాలి. ఇవి నాన్‌బెయిలబుల్ సెక్షన్లు. వీటినీ ఇక్కడ పూర్తిగా పక్కకుపెట్టేశారంటున్నారు. అరెస్టు చేసిన వెంటనే బెయిల్ వచ్చేలా చూసేందుకే ఇలా చేశారంటున్నారు.

Tags

Next Story