హుజూర్ నగర్ లో కాంగ్రెస్ కు షాక్.. కీలకనేత గుడ్ బై..

తెలంగాణలో హుజూర్ నగర్ ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. అధికార టిఆర్ఎస్, సిట్టింగ్ కాంగ్రెస్ తో పాటు బీజేపీ, టీడీపీ కూడా ఈసారి రంగంలో నిలబడటంతో హుజూర్‌నగర్ ఉప పోరు రక్తికట్టిస్తోంది. అన్ని పార్టీలు తమ బలగాలన్నింటినీ అక్కడే మోహరించాయి.
TRS ఈ ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతంలో హుజూర్ నగర్‌లో జరిగిన మూడు ఎన్నికల్లోనూ ఓటమి పాలయినా ఈసారి కైవసం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. పార్టీ ఇంఛార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, స్థానిక మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని గులాబీ దళం గ్రామాలను చుట్టేస్తోంది.
మరోవైపు కాంగ్రెస్‌కు చెందిన స్థానిక MPP, సర్పంచ్, 400 మంది కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి అంతా ఆకర్షితులు అవుతున్నారని.. టీఆర్ఎస్ ఉప ఎన్నికల ఇంచార్జ్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు.
హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్ గెలిస్తే.. ఓ కుటుంబానికి మాత్రమే లాభమని విమర్శించారు.. టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి. టీఆర్ఎస్‌ను గెలిపిస్తే.. నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చెందుతుందని అన్నారాయన. కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకుందని సైదిరెడ్డి ఎద్దేవాచేశారు.
కాంగ్రెస్ కూడా ధీటుగా ప్రచారం చేస్తోంది. అతిరథ మహారథులు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. పార్టీలో నేతల మధ్య ఐక్యత కేడర్‌లో ఉత్సాహం నింపుతోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడే ఉండి ప్రచారం చేస్తున్నారు. మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి సైతం ప్రచారానికి వస్తున్నారు.
బీజేపీ కూడా మండలాల వారీగా పార్టీ ఇన్‌చార్జులను నియమించి వీలైనన్ని ఎక్కువ ఓట్లు రాబట్టుకునేలా ప్రయత్నిస్తోంది. టీడీపీ కూడా తన ఓటు బ్యాంకును రక్షించుకునే ప్రయత్నంలో ప్రచారం నిర్వహిస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ప్రధాన పోరు రెండు పార్టీల మధ్యే అని ప్రచారం జరుగుతున్నా.. ఇతరులను తక్కువ అంచనావేసే పరిస్థితి లేదు. బీజేపీ, టీడీపీ సైతం ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో బహుముఖ పోరు కనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరు ఎవరి ఓట్లు చీలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల గుర్తు అయిన కారుతో సామీప్యత ఉన్న ట్రక్కు వల్ల తాము నష్టపోయామని టీఆర్‌ఎస్ వాపోతుండగానే, అభ్యర్థులకు కేటాయించిన కొన్ని గుర్తులు కూడా నష్టం చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com