భారత జట్టును భయపెడుతోన్న..

భారత జట్టును భయపెడుతోన్న..

విశాఖ పట్టణంలో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్లో ఘన విజయం సాధించిన భారత జట్టును పుణె పిచ్ భయపెడుతోంది. గురువారం నుంచి 14వ తేదీ వరకు గహుంజే స్టేడియంలో రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. రెండేళ్ల కిందట ఆస్ట్రేలియాతో ఇదే స్టేడియంలో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ టెస్ట్ మ్యాచ్లో మూడు రోజుల్లోనే టీమిండియాను సొంతగడ్డపై ఆస్ట్రేలియా ఓడగొట్టింది. ఆస్ట్రేలియా స్కోర్లు 260 & 285 పరుగులకు జవాబుగా టీమిండియా కేవలం 105 & 107 పరుగులే చేసి దారుణంగా ఓడిపోయింది. నాలుగో ఇన్నింగ్స్ లో పుజారా చేసిన 31 పరుగులే భారత్ కు అత్యధిక స్కోరంటే ఆ మ్యాచ్ లో భారత బ్యాటింగ్ ఎలా సాగిందో చెప్పనక్కరలేదు. దీన్ని బట్టే పుణె పిచ్ ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది. స్పిన్నర్లు ఏకంగా 31 వికెట్లు పడగొట్టారు. స్పిన్ పిచ్ తో ఆస్ట్రేలియాను పడగొట్టాలని భావించిన భారత జట్టు అదే స్పిన్ ఉచ్చులో పడి ఓటమిపాలైంది.

స్పిన్ పిచ్ కోసం యాజమాన్యం క్యూరేటర్ పాండురంగ సాల్గావ్‌కర్ పై ఒత్తిడి తెచ్చి పిచ్ స్వభావాన్ని పూర్తిగా మార్చి వేయించేందుకు ప్రయత్నించింది. మ్యాచ్ కి రెండు రోజుల ముందు పిచ్ ను పూర్తిగా స్పిన్ బౌలింగ్ కు అనుకూలంగా మార్చి వేసే ప్రయత్నంలో ఆ పిచ్ విభిన్నంగా, విపరీతంగా ప్రవర్తించింది. 2017 టెస్ట్ మ్యాచ్ మూడోరోజు మధ్యాహ్నానికి ముగిసిపోవడంతో పుణె పిచ్ కు ICC పూర్ రేటింగ్ ఇచ్చింది. క్యూరేటర్ కష్టాలు అంతటితో ఆగలేదు. పిచ్ కండిషన్ ను వివరిస్తూ క్యూరేటర్ పాండురంగ సల్గావ్‌కర్ ఒక స్టింగ్ ఆపరేషన్ లో మీడియాకు దొరికి పోవడంతో ICC అతనిని ఆరుమాసాల పాటు సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలం ముగిసిన అనంతరం మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అతనిని మళ్ళీ విధుల్లోకి తీసుకుని యధావిధిగా క్యూరేటర్ బాధ్యతలు అప్పగించింది. గురువారం టెస్ట్ మ్యాచ్ కు కూడా అతనే క్యూరేటర్ కావడం క్రికెటింగ్ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. భారత జట్టు చీఫ్ కోచ్ రవిశాస్త్రి పిచ్ ను కూలంకుషంగా పరిశీలించారు. ఈ సమయంలో సాల్గావ్‌కర్‌ కూడా శాస్త్రితో ఉన్నారు. అయితే పిచ్ ఎలా ఉన్నా.. టీమిండియా అద్భుత ప్రదర్శన ఇవ్వడం ఖాయమని రవిశాస్త్రి ధీమా వ్యక్తం చేశారు.

అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ ఛాంపియన్షిప్ లో భాగంగా జరుగుతున్న దక్షిణాఫ్రికా- ఇండియా మూడు టెస్టుల సిరీస్ లో పూనే మ్యాచ్ రెండోది. ఈ మ్యాచ్ ను కూడా గెలిచి, సిరీస్ ను ఇక్కడే చేజిక్కించుకోవాలని భారత జట్టు ఆశిస్తోంది. విశాఖ మ్యాచ్ లో ఘన విజయం సాధించిన టీమిండియా 40 ఛాంపియన్ షిప్ పాయింట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే అంతర్జాతీయ టెస్ట్ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో 160 పాయింట్లతో భారత జట్టు అగ్రస్థానంలో ఉంది. మరోవైపు సౌత్ ఆఫ్రికా ఇప్పటిదాకా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌ షిప్‌లో పాయింట్ల ఖాతా తెరవలేదు. విశాఖపట్టణం టెస్ట్ మ్యాచ్లో నాలుగో రోజు మధ్యాహ్నం దాకా భారత జట్టుతో సమవుజ్జీగా నిలిచిన దక్షిణాఫ్రికా జట్టు పుణె మ్యాచ్లో అదృష్టం కలిసి వస్తే పాయింట్ల ఖాతా తెరవాలని ఆశిస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story