బన్ని ఉత్సవాలు : 50 మందికి గాయాలు.. వీరారెడ్డి పరిస్థితి విషమం
కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవాలు మరోసారి రక్తసిక్తంగా మారాయి. కర్రలు విరిగాయి. తలలు పగిలాయి. అనవాయితీగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్ని నీరుగారిపోయాయి. స్వామి, అమ్మవారి విగ్రహాల కోసం 11 గ్రామాల మధ్య జరిగిన సమరంలో 50 మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరారెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని అదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
దేవరగట్టు కొండలో వెలసిన మల్లేశ్వర స్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఈ కర్రల యుద్ధం జరగడం ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది కర్రలు, మరికొందరు దీవిటీలు చేతపట్టి ఆర్ధరాత్రి వేళ కొండల మధ్య నుంచి దేవేరుల విగ్రహాలతో కళ్యాణోత్సవానికి బయలుదేరుతారు. ఇదే సమయంలో ఉత్సవ విగ్రహాలను దక్కించుకునేందుకు పలు గ్రామాల ప్రజలు పోటీ పడతారు. ఆయా గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి కర్రలతో తలపడతారు.
రక్తపాతంగా మారుతున్న కర్రల సమారాన్ని అడ్డుకునేందుకు ప్రతీసారి పోలీసులు ప్రయత్నిస్తూనే ఉంటారు. ఈ సారి కూడా దాదాపు వెయ్యి మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు. డ్రోన్ కెమెరాలతో నిఘా పెట్టారు. 50 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొలలు ఉన్న కర్రలను అనుమతించలేదు. అయితే..చివరికి లక్ష మంది పాల్గొన్న ఉత్సవంలో ఆ వెయ్యి మంది పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. స్వామి, అమ్మవారి విగ్రహాల కోసం కర్రలతో బాదేసుకున్నారు.
కొన్నేళ్లుగా వస్తున్న ఆచారం. ఆనావాయితీ పేరుతో జరుగుతున్న రక్తపాతాన్ని అడ్డుకోవటంలో పోలీసులు ప్రతీసారి విఫలం అవుతూనే ఉన్నారు. ఆ 11 గ్రామాల పెద్దలతో మాట్లాడి వారిలో మార్పు తీసుకురావాల్సిన అధికారులు..ఆ దిశగా పెద్దగా ప్రయత్నాలు చేయటం లేదు. కేవలం బన్నీ ఉత్సవం సమయంలో వందల సంఖ్యల్లో బలగాలను మోహరించి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ బందోబస్తుతో ఒరిగేదేమి లేదన్నది పోలీసులకు కూడా తెలిసిన విషయమే.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com