సాయంత్రానికి భారీ వర్షం.. అల్లాడుతున్న నగర ప్రజలు

సాయంత్రానికి భారీ వర్షం.. అల్లాడుతున్న నగర ప్రజలు

హైదరాబాద్ ను మరోసారి భారీ వర్షం వణికించింది. ఉపరిత ఆవర్తనం ప్రభావంతో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడ్డాయి. గత ఐదురోజులుగా సాయంత్రం సమయంలో కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్‌ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పగలంతా ఎండ, ఉక్కపోత ఉంటూ.. సాయంత్రానికి పెద్ద పెద్ద ఉరుములతో కురుస్తున్న భారీ వర్షంలో ప్రజలకు ఇక్కట్లు తప్పటం లేదు. బుధవారం కూడా భారీ వర్షం కురవడంతో నగరంలో ఎక్కడి ట్రాఫిక్ అక్కడే ఆగిపోయింది.

సిటీలోని జేఎన్టీయూ, కూకట్ పల్లి, ఎర్రగడ్డ, మూసాపేట, అమీర్ పేట, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , మాదాపూర్, పంజాగుట్ట, రాజ్ భవన్ రోడ్డు, కోఠి, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. సరిగ్గా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్లే సమయం కావటంతో ఉద్యోగులను తిప్పలు తప్పటం లేదు.

హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో దాదాపు 4 సెంటీమీటర్ల వరకు వర్షం కురిసింది. మరోవైపు ఉపరితల ఆవర్తన ప్రభావంతో రానున్న రెండు రోజులలో తెలుగు రాష్ట్రాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణ, ఏపీలతో పాటు యానాం, మధ్య మహారాష్ట్ర, ఒడిశా, కర్నాటక, అరుణాచల్‌ ప్రదేశ్‌, మేఘాలయ, అసోం తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

Tags

Next Story