ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి గెంటేసిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకుని ఇంటి నుంచి గెంటేసిన భర్త

ప్రేమించి పెళ్ళి చేసుకుంది.. భర్తే సర్వస్వం అనుకుంది. ఎన్నో ఆశలతో అత్తారింట అడుగుపెట్టింది. అయితే.. ఆ ఆశలన్నీ నాలుగు రోజులకే ఆవిరైపోయాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్త పెట్టే టార్చర్ ను దిగమింగింది. ఎముకలు విరిగేటట్టు భర్త కొట్టినా సహించింది. ఇలా ఎనిమిదేళ్ళ పాటు చిత్రహింసలు భరించినా.. భర్త రెండవ పెళ్ళి చేసుకోవడానికి సిద్థమవడం సహించలేపోయింది. వెంటనే పోలీసులను ఆశ్రయించింది. అక్కడా న్యాయం జరగకపోవడంతో భర్త ఇంటి ముందే మౌనదీక్షకు దిగింది. గత ఆరు రోజుల నుంచి మౌన పోరాటం కొనసాగిస్తోంది.

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి చెందిన సుబ్బలక్ష్మమ్మ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. 2012 సంవత్సరంలో కుప్పం ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే రోజుల్లో సహచర ఉపాధ్యాయుడు రమణయ్యను ప్రేమించింది. ఇద్దరూ కలిసి కుప్పంలోనే ఓ ఇంటివారయ్యారు. అయితే.. సుబ్బలక్ష్మమ్మను రమణయ్య పెళ్ళి చేసుకోవడం అతని తల్లికి ఏ మాత్రం ఇష్టం లేదు. వివాహానికి కూడా ఆమె హాజరు కాలేదు. కాలక్రమేణ ఇదంతా సర్దుకుంటుందని మొదట్లో సుబ్బలక్షమ్మ భావించింది. పెళ్ళయిన తరువాత శ్రీకాళహస్తికి ఇద్దరూ బదిలీ చేయించుకున్నారు. మూడురోజుల పాటు భర్తతో ఎంతో ఆనందంగా గడిపిన సుబ్బలక్షమ్మకు నాలుగోరోజు నుంచి కష్టాలు మొదలయ్యాయి.

శ్రీకాళహస్తికి వచ్చినప్పటి నుంచి రమణయ్య తల్లి.. కొడలు సుబ్బలక్ష్మమ్మను చిత్రహింసలు పెట్టడం ప్రారంభించింది. అదనపు కట్నం కోసం వేధించింది. కొడుకు రమణయ్యను కోడలితో కాపురం చేయకుండా అడ్డుకుంది. కట్నం తీసుకురాకుంటే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపొమ్మని తనను భర్త రమణయ్య చితకబాదేవాడని, ఎముకలు విరిగి ఎన్నోసార్లు ఆసుప్రతిలో చేరానని బాధితురాలు సుబ్బలక్ష్మమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.

భర్త పెట్టే చిత్రహింసలను మౌనంగా భరించిన ఆమె.. అతను రెండో పెళ్ళి చేసుకోవడానికి సిద్ధమవడాన్ని మాత్రం భరించలేకపోయింది. వెంటనే ఆమె శ్రీకాళహస్తి పోలీసులను ఆశ్రయించింది. అయితే.. రమణయ్యకు పోలీసుల సపోర్ట్ ఉండడంతో కేసు కూడా పెట్టలేదని బాధితురాలు ఆరోపిస్తోంది. తన భర్త తనతో కాపురం చేసే విధంగా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించాలని సుబ్బలక్ష్మి కోరుతోంది. గత ఆరురోజుల నుంచి భోజనం మాని భర్త ఇంటి ముందే ఆమె మౌన పోరాటం చేస్తోంది. అయితే.. రమణయ్య మాత్రం ఇంటికి తాళాలు వేసి తన తల్లిని తీసుకుని కనపడకుండా పారిపోయాడు. పరారీలో ఉన్న తన భర్తను తీసుకొచ్చి తన కాపురాన్ని నిలబెట్టాలని బాధితురాలు వేడుకుంటోంది.

Tags

Read MoreRead Less
Next Story