దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే తెలుసు : చంద్రబాబు

పోలీసులు సృష్టించిన అడ్డంకుల మధ్య టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన ప్రారంభమైంది. రెండు రోజులు పర్యటనలో భాగంగా తొలి రోజు గ్రామీణ విశాఖలోని ఆరు నియోజకవర్గాల వారీగా రివ్యూ నిర్వహించారు. పాడేరు, అరకు, పాయకరావుపేట, నర్సీపట్నం, యలమంచిలి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలపై ఫోకస్ చేశారు. సమావేశంలో వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.. టీడీపీ కార్యకర్తల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు
ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం ఆపేయడంపై చంద్రబాబు మండిపడ్డారు. రివర్స్ టెండర్ కారణంగా ఇప్పటికే పోలవరం నిలిచిపోయిందన్నారు. జగన్‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఏమీ తెలియదని..కేవలం దొంగ లెక్కలు రాసుకోవడం మాత్రమే తెలుసంటూ ఘాటు విమర్శలు చేశారు చంద్ర బాబు.
ఏపీలో మళ్లీ చీకటి రోజులు వచ్చాయన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఈ అంశంపై చంద్రబాబు మాట్లాడుతుండగానే.. సభలో పవర్ కట్ అయింది. వెంటనే దీనిపై సెటైర్ వేసిన చంద్రబాబు... కరెంటు గురించి మాట్లాడుదాం అనుకుంటే... ఇంతలోనే కరెంట్ పోయిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో కరెంటు కోతల్లేవని గుర్తు చేశారు.
శుక్రవారం పెందుర్తి, అనకాపల్లి, భీమిలి, గాజువాక నియోజకవర్గాలపై దృష్టి సారిస్తారు చంద్రబాబు. గత ఎన్నికల్లో ఓటమికి కారణాలను విశ్లేషిస్తూనే.. పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై ఫోకస్ చేస్తున్నారు చంద్రబాబు. అయితే ఎన్నికల తర్వాత తొలిసారిగా విశాఖకు వచ్చిన చంద్రబాబుకు టీడీపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికే ఏర్పాట్లు చేస్తే టీడీపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ర్యాలీలకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో నగరంలో చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ నుంచి పార్టీ కార్యాలయంకు ర్యాలీగా బయలుదేరిన చంద్రబాబును ఎన్ఏడి జంక్షన్ లో అడ్డుకున్నారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు చంద్రబాబు కాన్వాయ్ ని వదిలిపెట్టారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

