ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విపక్షాల మద్దతు

ఆర్టీసీ కార్మికుల సమ్మెకు విపక్షాల మద్దతు

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా సాగుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే.. తమ సమ్మెకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు కూడగట్టే పనిలో పడింది ఆర్టీసీ జేఏసీ. కాంగ్రెస్‌, బీజేపీ, టీటీడీపీ నేతల్ని కలిసి సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు. సంస్థను కాపాడుకునేందుకు, తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకే సమ్మెకు దిగామన్నారు ఆర్టీసీ జేఏసీ చైర్మన్‌ అశ్వత్థామరెడ్డి.

ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు కాంగ్రెస్‌ నేత శ్రీధర్‌బాబు. ఆర్టీసీ ఆస్తులపై కేసీఆర్ కుటుంబం కన్ను పడిందని విమర్శించారు. నోటీస్ ఇచ్చి సమ్మె చేస్తే ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. కార్మికుల సెల్ఫ్ డిస్మిస్ కాదు.. కేసీఆర్ సెల్ఫ్ గోల్ ఖాయమన్నారు.

ఆర్టీసి కార్మికులు చేస్తున్న సమ్మెకు పూర్తి మద్దతిస్తామని స్పష్టం చేసింది టీటీడీపీ. సీఎం కేసీఆర్‌ నియంతగా వ్యవహరిస్తున్నాడంటూ ఫైర్‌ అయ్యారు టీడీపీ నేతలు. ఆర్టీసీ కార్మికులకు తాము అండగా ఉంటామన్నారు.

ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించేందుకు పార్టీ తరపున ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని నిర్ణయించామన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. లక్ష్మణ్‌ . శనివారం రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌ జిల్లాల్లో, బస్‌ భవన్‌ ఎదుట, ఆర్టీసీ జేఏసీ ధర్నాలలో పాల్గొనాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీ ఆస్తులను కాజేసే కుట్ర చేస్తున్నారనీ, ఇప్పటికే వరంగల్‌లో మూడెకరాలను అనుచరులకు ఇచ్చేశారని మండిపడ్డారు.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు వీఆర్వో, వీఆర్‌ఏ జేఏసీ, తెలంగాణ పెన్షనర్ల జేఏసీ, వ్యాయామ టీచర్లు, ఎస్టీయూ సైతం మద్దతు ప్రకటించారు. తెలంగాణలోని అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు మద్దతు ఇస్తుండటంతో.. సమ్మె రోజురోజుకు ఉదృతమవుతోంది.

Tags

Read MoreRead Less
Next Story