మా కూతురికి మరణం ప్రసాదించండి : అర్జీ పెట్టుకున్న తల్లిదండ్రులు

అసలే పేద కుటుంబం. పూటగడవడమే కష్టమైన పరిస్థితి. కూలీ పని చేస్తే వచ్చే డబ్బులతో ఏ పూటకాపూట గడవడమే కష్టసాధ్యమైన స్థితి. అలాంటి కుటుంబంలో చిన్నారికి నయంకాని జబ్బు వచ్చింది. ఉన్న కాస్తంత ఇంటిని అమ్మి చిన్నారికి చికిత్స చేయించారు. అయితే ఆర్థిక స్థోమత లేకపోవడంతో చిన్నారిని బతికించుకునే మార్గం లేక చంపేయమని ప్రాధేయపడుతున్నారు.
చిత్తూరుజిల్లా మదనపల్లి మొదటి సెషన్స్ కోర్టులో కారుణ్య మరణానికి అర్జీ పెట్టుకున్నారు చిన్నారి సుహాని తల్లిదండ్రులు. సుహాని స్వస్థలం బి.కొత్తకోట మండలం బి.సి.కాలనీ. ఆ చిన్నారి వయస్సు ఒక సంవత్సరం.తల్లిదండ్రులు బావాజాన్, షబానా. వీరిది మేనరిక వివాహం. పుట్టినప్పటి నుంచి షుగర్ లెవల్స్ పడిపోయి అనారోగ్యంతో బాధపడేది. ప్రతిరోజు ఆరుగంటలకు ఒకసారి 2,400రూపాయల ఇంజెక్షన్ చిన్నారికి వేయాలి. అప్పులు చేసి మరీ 12లక్షల రూపాయల వరకు తల్లిదండ్రులు సుహానాకు ఖర్చు పెట్టారు. అయితే ఇక ఆర్థిక స్థోమత సరిపోక చిన్నారిని బతికించుకునే మార్గం లేక మదనపల్లి కోర్టులో కారుణ్యమరణానికి అర్జీ పెట్టుకున్నారు. వైద్యానికి ఎంత అవసరమైతే అంత మొత్తాన్ని దాతలు ఇవ్వాలని.. లేకుంటే సుహాని కారుణ్య మరణానికి అనుమతించాలని తల్లిదండ్రులు కోరారు. కూలి పనిచేస్తూ జీవనం సాగించే తమకు సుహానిని చంపుకోవడం తప్ప ఇక చేసేదేమీ లేదని బోరున విలపిస్తున్నారు తల్లిదండ్రులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com